Warangal : భూ వివాదంలో బాధితుడిని ఇబ్బంది పెట్టారనే ఆరోపణలతో ధర్మసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ రావుపై వేటు పడింది. ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావును ఏఆర్‌కు అటాచ్ చేస్తూ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ వివాదంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకొని, ఎదుటి వారికి సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ధర్మసాగర్ సీఐ పై నమస్తే తెలంగాణలో ఇటీవల ” సెటిల్మెంట్ ఖాకీ”..”భూ కబ్జా దారుడికి ధర్మ సాగర్ సీఐ వత్తాసు”.. “మంత్రి తుమ్మలతో సీఐ పైరవీ” అంటూ వరుస కథనాలు ప్రచురించింది.
వీటి పై వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పందించారు. సీఐ శ్రీధర్ రావుపై సిపి విచారణకు ఆదేశించారు. కాగా ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సి ఉంది. విచారణ పూర్తై, నివేదిక వచ్చే వరకు సీఐ శ్రీధర్ రావును ఏఆర్‌కు అటాచ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.