పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 15: ప్రముఖ రచయిత, ప్రజా కవి, విశ్రాంత ఉపాధ్యాయుడు, దివ్యాంగుల సంఘం నాయకుడు నల్లెల రాజయ్య (62) కన్నుమూశారు. ములుగు జిల్లా జాకారానికి చెందిన ఆయన హనుమకొండలోని పద్మాక్షమ్మ గుట్ట వద్ద నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. రాజయ్య అనేక కవితలు, వ్యాసాలు రాసి ప్రజలను చైతన్యం చేశారు. అలాగే ఉపాధ్యాయ, దివ్యాంగుల సమస్యలపై గళమెత్తారు. సామాన్యులకు వెన్నుదన్నుగా నిలుస్తూ పేరు సంపాదించుకున్నారు. వరంగల్ రచయితల సంఘం ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. విలువైన రచనలను సమాజానికి అందించారు. ఆయన ఆకాల మృతిపై సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రతినిధులు, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు పీ శ్రీనివాస్‌రావు, సభ్యులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
కవి నల్లెల రాజయ్య మరణం తెలుగు సాహితీ ప్రపంచానికి తీరని లోటని కాళోజీ ఫౌండేషన్, మిత్ర మండలి బాధ్యులు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, అంపశయ్య నవీన్, పందిళ్ల అశోక్‌కుమార్, ఆగపాటి రాజ్‌కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచారని వారు పేర్కొన్నారు. కవి రాజయ్య పార్థివదేహానికి పలువురు కవులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.