పోచమ్మమైదాన్, నవంబర్ 13: జాతీయోద్యమం, తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యాన్ని నింపిన గొప్ప కవులు కాళోజీ సోదరులని ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వరం శంకరం అన్నారు. హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల సెమినార్ హాల్లో కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ అపంశయ్య నవీన్ అధ్యక్షతన బుధవారం రాత్రి కాళోజీ సోదరుల యాది సభ, స్మారక పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కాళోజీ సోదరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ తెలుగు సాహితీ ప్రపంచంలో రామలక్ష్మణుల మాదిరిగా కాళోజీ సోదరులు సమాజ శ్రేయస్సుకు అంకితమై పనిచేశారని అన్నారు. వారు జీవించినంతకాలం రాజ్యం నిరంకుశ పోకడలను నిరసిస్తూ, ప్రజల పక్షాన ఉంటూ సమాజ హితవు కోరారని అన్నారు. కులాలు, మతాలకు, ప్రాంతాలకతీతంగా అణచివేతకు గురవుతున్న పీడిత ప్రజల తరపున నిస్వార్థంగా పనిచేయడమే కాకుండా నిద్రాణమైన తెలంగాణ సమాజాన్ని తమ కవిత్వంతో మేల్కొలిపిన గొప్ప కవి సోదరులని కొనియాడారు.
రాష్ట్రం, దేశంలో ఏర్పడ్డ నిర్బంధ కాలాన్ని ఎదిరించిన మహానుభావులని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రజల్లో చైతన్యాన్ని, ధైర్యాన్ని నింపిన గొప్ప కవి, ఉద్యమకారుడు కాళోజీ నారాయణరావు అని తెలిపారు. గత 30 ఏళ్ల నుంచి కాళోజీ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను కార్యదర్శి వీఆర్ విద్యార్థి వివరించారు. అలాగే ఓరుగల్లు ఉర్దూ కవులకు షాద్ రామేశ్వర్రావు గురువులాంటి వారన్నారు.
ఆయన కవిత్వం దక్కన్ ప్రాంతంలో ఉర్దూ కవులకు ఆదర్శనీయమైనదని పేర్కొన్నారు. అనంతరం కాళోజీ ఫౌండేషన్ కోశాధికారి పందిళ్ల అశోక్ కుమార్ పురస్కార గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా, రామేశ్వర్రావు షాద్ స్మారక పురస్కారాన్ని పాత్రికేయుడు వహీద్ గుల్షన్‌కు అందజేశారు. అలాగే ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మాకర పురస్కారాన్ని సుప్రసిద్ధ దారు శిల్పి మర్రి గోపాల్‌రెడ్డికి అందించారు. వీరికి రూ.10,116 నగదుతో పాటు మెమెంటో అందజేసి, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఎన్వీఎన్ చారి, ఫౌండేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఆగపాటి రాజ్‌కు మార్, పలువురు సాహితీవేత్తలు, పరిశోధక విద్యార్థులు, కవులు, రచయితలు, కాళోజీ అభిమానులు పాల్గొన్నారు.