ఖిలావరంగల్, మే 16: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీ కేటగిరీ సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలన్నారు. డొనేషన్ల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నా సంబంధిత కళాశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలంటూ టీఏఎఫ్ఆర్సీ ముందు ప్రతిపాదనలు ఉంచాయని, వాటిని తిరస్కరించాలని కోరారు. ఇప్పటికే ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు అధిక ఫీజులను వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యను పూర్తిగా వ్యాపారమయంగా మార్చాయని తెలిపారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందకుండా పోతుందని, అర్హతలేని వారితో కాలేజీలను నడిపిస్తున్నాయని విమర్శించారు.