మహదేవపూర్, జూలై 28: ప్రకృతి సిద్ధంగా అడవుల్లో పెరిగే పుట్ట గొడుగుల రుచి అద్భుతంగా ఉంటుంది. ఇందులో సమృద్ధిగా పోషకాలు కూడా ఉండడంతో పుట్టగొడుగు (పుట్టకొక్కు)లకు భలే డిమాండ్ ఉన్నది. వర్షాకాలంలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఆహారంపై ప్రజలు ఆసక్తి కనబ రు స్తున్నారు. ఎలాంటి రసాయ నాలు లేకుం డా ప్రకృతి ఒడిలో వాటంతటవే మొలకెత్తి, రుచితో పాటు పుష్కలంగా పోషక విలువలు ఉండడంతో జనాలు వీటిని తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
దీంతో వీటి గిరాకీ ఊపందుకుం ది. గతేడాది పుట్టగొడుగుల కట్ట రూ.50 ఉండగా, ఈ యేడాది ఏకంగా రూ.500 పలుకుతోంది. ధర ఎక్కువైనా పర్వాలేదని, ఈ సీజన్లో ఒక్కసారై నా వాటి రుచి చూడాలని చాలా మంది వాటిని కొనుగోలు చేస్తున్నారు. కొందరైతే కొందామంటే ధర ఎక్కువగా ఉందని అడవి బాట పడుతున్నారు. గతంలో గిరిజనులు, కొన్ని కుటుంబాలు మాత్రమే పుట్ట కొక్కుల కోసం అడవులకు వెళ్లేది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉండడంతో మహదేవపూర్ మండలంలోని పలు గ్రామాల యువకులు వేకువజామునే వెళ్లి వాటిని సేకరిస్తున్నారు. అక్కడి వారికి ఇది మంచి ఉపాధి మార్గంగా మారింది.