నల్లబెల్లి, మార్చి 24 : కాకతీయుల నాటి సంపద కళా విహీనం కావడం బాధాకరమని తహసీల్దార్ ముప్పు కృష్ణ అన్నారు. ‘నల్లబెల్లిలో గుప్త నిధుల తవ్వకాలు’ అని శీర్షికన నమస్తే తెలంగాణలో ఈ నెల 17న వార్త కథనం వెలువడింది. ఈ మేరకు స్థానిక తహసిల్దార్ మండలంలోని శనిగరం శివారులో గల శివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో శిల్ప కళను ఆయన పరిశీలించి మంత్రముగ్ధులయ్యారు. అనంతరం మాట్లాడుతూ శివాలయంలో గత 20 ఏళ్ల క్రితం అద్భుతమైన శివలింగంతో పాటు అనేక రకాల శిల్పాలు సైతం ఉండేవని వీటిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లినట్లు పలువురు మండల ప్రజలు తెలిపారన్నారు.
ఆలయ గర్భగుడితోపాటు ఆలయ పరిసర భూముల్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల తవ్వకాలు చేపట్టిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఈ తవ్వకాలతో అద్భుతమైన శివాలయం విధ్వంసం కావడం బాధాకరమన్నారు. కాకతీయుల నాటి ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ఆలయ స్థితిగతులపై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. తాసిల్దార్ వెంట సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ ఉన్నారు.