నమస్తే నెట్వర్క్, జూలై 21 : ఎడతెరిపిలేని వాన.. మూడు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసిముద్దయింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. వరద పోటెత్తడంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. లోలెవల్ కల్వర్టులు, రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటల్లోకి నీరు చేరగా, కొన్ని చోట్ల మత్తడి పోస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన టేకులగూడెం గ్రామం వద్ద లోలెవల్ బ్రిడ్జి వద్దకు గోదావరి వరద భారీగా వచ్చి చేరడంతో ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. మంగపేట మండలంలోని మల్లూరు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 115 మీటర్లు కాగా ఆదివారం సాయంత్రానికి 114 మీటర్లకు చేరింది.
లక్నవరంలో నీటి మట్టం 21 ఫీట్లకు, రామప్పలో 24ఫీట్లకు చేరింది. ఏటూరునాగారం మండలంలోని ఎలిశెట్టిపల్లి, దొడ్లవాగు ఉప్పొంగడంతో మల్యాల, కొండాయి, గోవిందరాజుల కాలనీకి రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అయితే, ఈ రెండు వాగుల వద్ద అధికారులు బోట్లు ఏర్పాటు చేశారు. ములుగు మండలంలోని సర్వాపురం-జగ్గన్నగూడెం గ్రామాల మధ్య బొగ్గులవాగు లోలెవల్ వంతెన వరద ఉధృతికి పూర్తిగా నీటమునిగింది. వర్షం ఇలాగే కొనసాగితే అంకన్నగూడెం, జగ్గన్నగూడెం, సమీపంలో ఉన్న గొత్తికోయగూడెం జలదిగ్బంధంలో చిక్కుకోనున్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని సుల్తాన్పూర్, జంషెడ్దేవిపేట మధ్య లోలెవల్ కల్వర్టుపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ములుగు, అబ్బాపూర్ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. టేకుమట్ల, రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య చలివాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మరోవైపు గర్మిళ్లపల్లి, ఓడేడుతో పాటు బూర్నపల్లి, కిష్టంపేట మధ్య గల మానేరు వరద ఉధృతికి తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గణపురం మండలం అప్పయ్యపల్లి, వెల్తుర్లపల్లి గ్రామాల మధ్య లోలెవల్ కల్వర్టు నుంచి మోరంచవాగు ప్రవహిస్తుండడంతో ఈ దారిలో రాకపోకలు నిలిచిపోయాయి.
భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి సమీపంలో గల మోరంచ వాగు ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. వాగు మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తుందని, వరద ప్రభావం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఓసీ-2,3 గనుల్లోకి భారీగా వరదనీరు, మట్టి చేరడంతో ఉపరితల గనులు బురదయమై బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. తాడిచర్ల జెన్కో ఆధ్వర్యంలో చేపడుతున్న ఏ ఎమ్మార్ కంపెనీలో బొగ్గు ఉత్పత్తికి ఆంతరాయం ఏర్పడింది.

హనుమకొండ, వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. డీఆర్ ఎఫ్ బృందాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. శాయంపేట మండలంలోని మాందారిపేట నుంచి సూరంపేటకు వెళ్లే దారిలో కాజువేపై నుంచి వరద వెళ్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువు నిండడంతో పరిసర లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ సత్యశారద, అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లతిమ్మాపురం రహదారిలోని వట్టెవాగు నీరు పైకి చేరుకోవడంతో రాకపోకలు స్తంభించాయి.
కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది 9.20 మీటర్ల ఎత్తులో 5.01 లక్షల క్యూసెక్కులుగా పారుతున్నది. వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి ప్రవాహం15.830 మీటర్లకు చేరింది. అలాగే ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ఆదివారం సాయంత్రం 5 గంటలకు 14.400 మీటర్లకు చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక 14.830 మీటర్లకు జారీ చేయనుండగా, రాత్రి వరకు దాటే అవకాశం ఉంది.