కేసముద్రం/స్టేషన్‌ఘన్‌పూర్, జనవరి 18 : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసముద్రం మున్సిపాలిటీని కేసముద్రం టౌన్, విలేజ్, అమీనాపురం, ధన్నసరి, సబ్‌స్టేషన్‌తండా గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ 16 వార్డులతో, స్టేషన్ఘన్పూర్ను స్టేషన్‌ఘన్‌పూర్, శివునిపల్లి, చాగల్ జీపీలను కలుపుతూ ఏర్పాటు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసే కార్యాచరణ ప్రారంభమైంది. కేసముద్రం కోసం 2023 ఫిబ్రవరి, జూలై నెలల్లో నాటి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో నాలుగు విలీన పంచాయతీలతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్ కోసం కూడా ప్రతిపాదనలు పంపించారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. గత డిసెంబర్ 7న కేసముద్రంను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు మళ్లీ గ్రామాల ఆమోదాన్ని పంపించాలని మండల పరిషత్ కార్యాలయానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో అదే నెల 9న గ్రామ సభలు నిర్వహించి గ్రామస్తుల ఆమోదంతో నివేదికను అధికారులు పంపించారు. ఈ మేరకు 20న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో కేసము్రద్రం, స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడంపై ప్రకటన చేశారు. అనంతరం జనవరి 3న బిల్లును గవర్నర్‌కు పంపించగా, ఆయన ఆమోదంతో శుక్రవారం రాత్రి గెజిట్ విడుదలైంది. దీంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జీవోలను శనివారం విడుదల చేసింది.