హనుమకొండ/సుబేదారి, జూన్ 29 : తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని మున్సిపల్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ మున్సిపల్ వరర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఉదయం మున్సిపల్ కార్మికులు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి ర్యాలీగా బయలుదేరి సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఇండ్ల ఎదుట ధర్నా నిర్వహించారు.
గేట్ల లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికులను సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే సుమారు రెండు గంటలపాటు ధర్నా చేసిన అనంతరం ఎమ్మెల్యేల సీసీలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్ మాట్లాడుతూ.. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మున్సిపల్ కార్మికులకు ఏం చేశారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు పెంచుతామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన సీఎం ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా పెంచకపోగా వారి శ్రమను దోచుకునేలా పనిభారం పెంచారని అన్నారు.
చనిపోయిన కార్మికుల దహన ఖర్చులకు రూ.30వేలు ఇచ్చే పరిస్థితి లేదని, ప్రభుత్వ విధానాలకు నిరసనగా రానున్న కాలంలో కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్ కార్మికుల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు రోంటాల కోటేశ్వర్, కొట్టే మల్లన్న, బొంకూర్ నాగరాజు, వెంకటస్వామి, రవీందర్, సురేశ్, అనీల్, సునీల్, సుధాకర్, అశోక్, శ్యాంసుందర్, సువర్ణ, రేణుక, సంతోష, శివ నారాయణ,రమేష్, రాజేష్, శ్రీనివాస్, మధు కార్మికులు పాల్గొన్నారు.