హనుమకొండ, ఏప్రిల్ 05: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ (GWMC) పరిధిలో లీకేజీల పర్వం కొనసాగుతుంది. ప్రతి నిత్యం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడో ఓచోట నల్లాల లీకేజీలు అవుతూనే ఉన్నాయి. తాజాగా కాకతీయ యూనవర్సిటి రెండో గేటు సమీపంలో గేట్ వాల్ లీకై నీరు ఎగిసిపడుతూ పారుతుంది. ఓ జలపాతంలా నీరంతా వృథాగా పోతున్నది. అయినప్పటికీ జీడబ్ల్యూఎంసి అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవి కాలంలో తాగునీటి సమస్య వస్తుంటే లీకేజీల విషయంలో మాత్రం సంబందిత శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు.
ఏదో లీకేజీ అయినపుడు తూ తూ మంత్రంగా మరమ్మతులు చేసినట్లుగా చేసి బల్దియా అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ లీకేజీలు అవుతునే ఉన్నాయి. తాజాగా కేయూ రెండవ గేట్ వద్ద అయిన లీకేజీ కూడా అదే కోవలోకి చెందుతుందని స్థానికలు అంటున్నారు. ఇప్పటికైనా లీకేజీ విషయంలో జీడబ్ల్యూఎంసీ అధికారులు, ప్రజా ప్రతినిథులు ప్రత్యేక దృష్టి సారించి పైపులైన్, గేట్ వాల్వ్‌ల లీకేజీలు లేకుండా చర్యలు తీసుకొవడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని పలు కాలనీవాసులు కోరుతున్నారు.