solar rooftop | ఏటూరు నాగారం, జూన్ 16: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో సోలార్ రూఫ్ టాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. సోమవారం నాడు బస్టాండ్ సమీపంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించారు. ఈ పథకం కింద రూ.78వేలు సబ్సిడీ అందించడం జరుగుతుందని సంబంధిత ములుగు ఫీల్డ్ ఆఫీసర్ శిరీష, గ్రామీణ బ్యాంక్ ములుగు బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, ఫీల్డ్ ఆఫీసర్ కిరణ్ వివరించారు.
సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే అర్హులైన వారికి బ్యాంక్ ద్వారా రుణం కూడా అందిస్తామని వారు తెలిపారు. లబ్ధిదారుడు 10 శాతం అమౌంట్ చెల్లించాలని, సబ్సిడీ కింద రూ.78వేలు పోగా మిగిలిన సొమ్మును బ్యాంక్ ద్వారా రుణంగా అందిస్తామని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద బ్యాంక్ ద్వారా ఎలా రుణం పొందవచ్చో వారు వివరించారు. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఉపయోగించుకోవడమే కాకుండా తిరిగి టీజీఎన్పీడీసీఎల్ వారికి విక్రయంచే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. ఆసక్తిగల వారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ను సంప్రదించాలని కోరారు.