రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
వామపక్ష నాయకుల డిమాండ్
చట్టాల ప్రతులను దహనం చేసి నిరసన
నర్సంపేట, జూన్ 5: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాలతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతున్నదని, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని ఏఐకేఎస్‌సీసీ జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేశ్ పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో శనివారం రైతు చట్టాల ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాల అమలుతో లాభాలే ధ్యేయంగా కార్పొరేట్ శక్తులు పర్యావరణాన్ని ధ్వంసం చేసి సమాజానికి హాని కలిగిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ సుస్థిరత సమస్యలను నొక్కి చెప్పటానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున సంపూర్ణ క్రాంతి దివస్ పేరుతో వ్యవసాయ చట్టాల ప్రతులను దహనం చేశామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఇల్లందుల సాంబయ్య, కల్లెపల్లి ప్రణయదీప్మాదిగ, డేగల శ్రీనివాస్, కన్నం వెంకన్న, వంగాల రాగసుధ, జన్ను అనిల్, వెంకన్న, లక్ష్మయ్య, రవళి, వీరన్న పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
గీసుగొండ: కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎంసీపీఐ(యూ) జిల్లా నాయకుడు గోనె కుమారస్వామి హెచ్చరించారు. మచ్చాపురంలో రైతు చట్టాల ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలోనూ రైతులు చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో నిరసన తెలుపుతున్నా కేంద్రానికి కనువిప్పు కలుగడం లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, రాజయ్య, మల్లికార్జున్, కొమురెల్లి, రవీందర్, సురేశ్, రవీందర్, సాంబయ్య పాల్గొన్నారు.
పర్వతగిరి: కేంద్రం రైతు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు సూరన్న మాట్లాడుతూ కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఏడాది అయిందని, వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, దయాకర్, వెంకన్న, దర్గయ్య, రాజు పాల్గొన్నారు.
దుగ్గొండి: కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలతో రైతాంగానికి తీవ్రనష్టం వాటిల్లుతుందని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ సభ్యుడు కుసుంబ బాబురావు అన్నారు. మండలంలోని రేబల్లెలో పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డినెన్స్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎంసీపీఐ నాయకులు ఎస్ భాస్కర్, సర్పంచ్ గటికె మమతాప్రభాకర్, పీ చేరాలు, పకిడె చందర్, కటికె స్వామి, రాజేశ్వర్‌రావు, ఐలయ్య, బుచ్చయ్య, తిరుపతిరావు పాల్గొన్నారు.
చట్టాలను రద్దు చేసే వరకూ పోరాటం
సంగెం: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకూ పోరాడుతామని ఏఐకేఎస్‌సీసీ ప్రతినిధులు అన్నారు. మండలంలోని గవిచర్లలో రైతు చట్టాల ప్రతులను దహనం చేసి మాట్లాడారు. ప్రధాని మోదీ విధానాలను వ్యతిరేకిస్తున్నామని, రైతులకు ఇబ్బందికరంగా ఉన్న చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గోనె రాంచందర్, ఎండీ ఇస్మాయిల్, దామోదర్, యువ రైతులు ప్రవీణ్, నరేశ్, అభిలాశ్ పాల్గొన్నారు.