– ‘ప్రజ్వల’ స్టేట్ కోఆర్డినేటర్ సురేశ్ కుమార్
రుద్రంపూర్, ఫిబ్రవరి 19 : ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యవస్థీకృత నేరం మానవ అక్రమ రవాణా అని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ స్టేట్ కో ఆర్డినేటర్ సురేశ్ కుమార్ అన్నారు. గురువారం ప్రజ్వల అలాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల కొత్తగూడెం సంయుక్త ఆధ్వర్యంలో “ఆడపిల్లల సంరక్షణ – యువకుల పాత్ర” అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేశ్ కుమార్ మాట్లాడుతూ..మానవ అక్రమ రవాణా, లైంగిక దోపిడి, సైబర్ ట్రాఫికింగ్ అంశాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్), 181 (మహిళా హెల్ప్‌లైన్), 100 (పోలీస్), 1930 (సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్), 108 (అత్యవసర వైద్య సేవలు) నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల అక్రమ రవాణా రోజురోజుకు పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. యువత సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాలు, సైబర్ ట్రాఫికింగ్ వంటి అంశాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లెక్చరర్ అలేఖ్య మాట్లాడుతూ.. మహిళలు, పిల్లల అక్రమ రవాణా ఒక ఘోర నేరమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు ఎదురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. యువత బాధ్యతతో ముందుకు వచ్చి బాలికల రక్షణలో చురుకైన పాత్ర పోషిస్తేనే సమాజంలో సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని పలువులు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజ్వల అసిస్టెంట్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, అధ్యాపకులు రఘురామ్, ధరణి శ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు.