ఏటూరునాగారం : ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో అటవీశాఖ ఫాస్టాగ్(FASTag) టోల్గేట్ చెక్ పోస్ట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అభయారణ్యంలో వాహనాల నుంచి అటవీశాఖ, పర్యావరణ పరిరక్షణ పేరుతో మాన్యువల్‌గా రుసుము వసూలు చేస్తుంది. అయితే తాజాగా అభయారణ్యంలో నాలుగు చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొదట ఏటూరునాగారం చెక్‌పోస్ట్ వద్ద ఫాస్టాగ్ టోల్గేట్ ఏర్పాటు చేస్తున్నారు. కేవలం జాతీయ రహదారులపై మాత్రమే ఈ టోల్గేట్ ఏర్పాటు చేస్తారు. కానీ అటవీశాఖ ఇందుకు శ్రీకారం చుట్టింది.
వాజేడు, వెంకటాపురం, మంగపేట ఇతర ప్రాంతాల ఇసుక క్వారీల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వరంగల్- హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. ఈ లారీల నుంచి అటవీశాఖ ప్రస్తుతం రూ.200 వసూలు చేస్తున్నది. ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే భారీ వాహనాలను నుంచి కూడా రుసుము వసూలు చేస్తున్నారు. గతంలో అభయారణ్యంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వకుండా నిషేధం విధించేవారు. ఉదయం 6 గంటల తర్వాత ప్రవేశం కల్పించి రాత్రి 9 తర్వాత నిషేధం ఉండేది.
అలాంటి అభయారణ్యంలో ప్రస్తుతం వసూళ్ల కోసం చెక్‌పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఫాస్టాగ్ చెక్‌పోస్ట్‌లు 24 గంటలు కొనసాగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. లారీలు ఇతర భారీ వాహనాల నుంచి రూ.200, డీసీఎం బోలోరో వాహనాలకు రూ.100 వసూలు చేయనున్నారు. ఇక వాహనాల నెంబర్లు రికార్డు అయ్యే విధంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్‌లో డబ్బులు ఐసిఐసిఐ బ్యాంకులో జమ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. మరో వారం రోజుల్లో ఈ టోల్గేట్లు తెరచుకోనున్నాయి.