ఏటూరునాగారం: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామసభల ద్వారా పరిష్కరించుకోవాలని ఏటూరు నాగారం (Eturnagaram) ఎస్ఐ తాజుద్దీన్ కోరారు. ఏటూరు నాగారం మండలంలోని రాంనగర్, రామన్నగూడెంలో గ్రామ సభలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శబరీష్, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ గ్రామాల్లో స్మశాన వాటికకు దారి లేదనే విషయాన్ని గ్రామస్తులు ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చారు.
అదేవిధంగా గ్రామాల్లో డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో మురుగు నీరు కాలువల్లో నిలిచి దుర్గంధం వెలువడమే కాకుండా దోమలు వస్తున్నాయని వివరించారు. ఈ విషయాలపై వెంటనే మండల స్థాయి అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామసభల్లో తమ స్యలు విన్న పోలీసులు, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న యువకులు పెడదోవ పట్టకుండా మంచి భవిష్యత్తును రూపుదిద్దుకోవాలని ఈ సందర్భంగా ఎస్ఐ సూచించారు. గ్రామసభలో మహిళలు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.