ములుగు : కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క (Minister Sitakka) అన్నారు. ఆదివారం ఆమె ములుగు జిల్లా (Mulugu District) లో పర్యటించి మేడారం సమ్మక్క (Sammakka) -సారలమ్మ(Saralamma) లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఫిబ్రవరిలో జరిగే మహా జాతర ఏర్పాట్లపై మానుకోట ఎంపీ మాలోతు కవిత, జడ్పీచైర్‌పర్సన్ బడే నాగజ్యోతితో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులను చేపట్టేందుకు రూ.75 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల టెండర్ల నిర్వహణ పూర్తి చేశామని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హాయం (KCR Government) లో ఆమోదించిన నిధులను విడుదల చేశామని, అవసరం అయితే మరిన్ని నిధులను విడుదల చేస్తామని పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా పనులను చేపట్టి నాణ్యతతో పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జాతరను విజయవంతం చేస్తామని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని వివరించారు.
భక్తులు ఇప్పటి నుంచే మేడారం రావడం ప్రారంభమైందని, వారికి అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని అన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని బీజేపీ నాయకులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మంత్రి సూచించారు. మేడారం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు.