ములుగు : జిల్లాలోని నూగూరు మండలం వీరభద్రవరం గ్రామ పరిధిలోని ముత్యం ధార జలపాతం సమీపంలో మందు పాతర పేలి(Landmine explosion) ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణ మూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణమూర్తి మరో నలుగురితో కలిసి అడవిలో బొంగు కట్టెల కోసం వెళ్లారు.
ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వారు అమర్చిన మందు పాతరపై కృష్ణమూర్తి కాలు వేయగా ఒక్కసారిగా పేలి కాలుకు తీవ్ర గాయమైంది. వెంట ఉన్న వారు 108 కు సమాచారం అందించి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు కృష్ణమూర్తికి చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ములుగు జిల్లా కేంద్రానికి రిఫర్ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.