పచ్చదనం పెంచేందుకు మరో ప్రకృతి వనం
పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం
యుద్ధప్రాతిపదికన ప్రభుత్వ స్థలాల గుర్తింపు
యాదాద్రి ఫారెస్టు మోడల్ తరహాలో ప్రణాళిక
వరంగల్ రూరల్, జూన్ 24(నమస్తే తెలంగాణ) : ఇప్పటికే ఊరికో వనంతో పచ్చదనాన్ని పెంచుతున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మండలానికో మెగా పార్కు ఏర్పాటుచేయనున్నది. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలో ఒకేచోట పది ఎకరాలు గల ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశిస్తూ ఈ నెల 19న గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి కావాలని పేర్కొన్నారు. యాదాద్రి ఫారెస్టు మోడల్ ప్లాంటేషన్ మాదిరిగా బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఉండాలని, వీటిలో కనీ సం 1.5 మీటర్ల ఎత్తు ఉన్న మొక్కలు నాటాలని కమిషనర్ పేర్కొన్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటడం, చిట్టడవిని తలపించేలా ఉండడం యాదాద్రి ఫారెస్టు మోడల్ ప్లాంటేషన్ ప్రత్యేకత. యాదాద్రి జిల్లాలో అనూహ్య ఫలితాలిచ్చిన ఈ మోడల్ ప్లాంటేషన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది జిల్లాలో ప్రయోగాత్మకంగా అధికారులు కొన్ని గ్రామాల్లోని మోడల్ ప్లాంటేషన్ చేపట్టగా సత్ఫలితాలివ్వడంతో ఇదే తరహాలో మెగా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు సిద్ధమైంది.
వేగంగా ప్రభుత్వ స్థలాల గుర్తింపు
జిల్లాలో పదహారు మండలాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఎం హరిత ప్రతి మండలంలో ఒకేచోట పది ఎకరాలు ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు కొద్ది రోజుల నుంచి ఇదే పనిలో తలమునకలయ్యారు. గురువారం వరకు ఒక మండలంలో మినహా అన్నిచోట్లా స్థలాలను గుర్తించారు. వీటిని ఖరారు కూడా చేసినట్లు తెలిసింది. పరకాల మండలంలో మాత్రం స్థలం ఎంపికపై కసరత్తు ఇంకా జరుగుతున్నట్లు సమాచారం. మిగతా 15 చోట్ల మండలకేంద్రం లేదా సమీప గ్రామం లో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ స్థలాలపై నివేదిక నేడో రేపో ప్రభుత్వానికి చేరనుంది. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, వీటి కోసం గుర్తించిన ప్రభుత్వ స్థలాలు, జూలై ఒకటి నుంచి ప్రారంభమయ్యే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు శుక్రవారం కలెక్టర్ హరిత కలెక్టరేట్లో అధికారులతో సమావేశం కానున్నా రు. శనివారం హైదరాబాద్‌లో కలెక్టర్లు, అదనపు కలెక్ట ర్లు, డీపీవోలు, డీఆర్డీవోలతో సీఎం కేసీఆర్ సదస్సు నిర్వహించనున్న క్రమంలో ఈలోగా మండలానికో మెగా ప్రకృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించారు.
ఇరవై రకాల మొక్కలు
మెగా పల్లె ప్రకృతి వనాల్లో నాటాల్సిన మొక్కలకు సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఒక్కో ఎకరంలో నాలుగు వేల మొక్కలు నాటాలని, వీటిలో 20 రకాల మొక్కలు ఉండాలని ఆయన ప్రతిపాదించారు. ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, ఇప్ప, సాండల్‌వుడ్, రేగు, కుంకుడు, పనస, సీమచింత, అందుగ, నెమలినార, చింతతో పాటు ఈత, హెన్న, సీతాఫల్, జామ, దానిమ్మ, కరివేప, నిమ్మ, వెదురు, జమ్మి, వావిలి, తంగేడు, అడ్డసరం, పారిజాతం, తిప్పతీగ, పొడపత్రి తదితర మొ క్కలు ఉండాలని తెలిపారు. అంతేగాక పార్కు చుట్టూ బయో ఫెన్సింగ్‌కు గచ్చకాయ, మెహిందీ మొక్కలు నాటాలని సూచించారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో ప్రతిపాదిత బృహత్ పల్లె ప్రకృతి వనాల స్థలాల్లోని పిచ్చి మొక్కలను తొలగించాలని, చదును చేయాలని, మొ క్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.