నల్లగొండ, ఫిబ్రవరి 12 : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ జిల్లాలో నల్లగొండ డ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, ఇతర మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, నాగార్జునసాగర్ రోడ్లోని శ్రీ రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్ సమీపంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జిల్లాలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మిర్యాలగూడకు సంబంధించి అవంతీపురం మార్కెట్ యార్డులో, నందికొండ, హాలియా మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు నల్లగొండ సమీపంలోని నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో, దేవరకొండ, చండూరు, చిట్యాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ప్రతి వార్డుకు ఒక కౌంటింగ్ టేబుల్ ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.
ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ అసిస్టెంట్, ఇద్దరు సూపర్వైజర్లు, ఆర్ఓలు ఉంటారన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత రెగ్యులర్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ఎక్కువ వార్డులు ఉన్నచోట పోలింగ్ కేంద్రాలను బట్టి రౌండ్స్ లెక్కించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు, ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లను అనుమతించడం జరగదని, ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి ఉన్నారు.

మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ బి.చంద్రశేఖర్