పదెకరాల స్థలంలో నిర్మాణం
రూ. 43లక్షలతో పనులు ప్రారంభం
పరిశీలించిన జడ్పీ సీఈవో, ఎంపీడీవో
ములుగురూరల్, ఆగస్టు21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికీ ఒక బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ములుగు మండలానికి చెందిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఇంచర్ల గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రూ.43లక్షల నిధులతో బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు చేపడుతున్నారు. ములుగు నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లే 163 జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వే నంబర్ 33లో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు కేటాయించారు. సదరు భూమిలో నిర్మాణ పనులను శనివారం ప్రారంభించారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ స్థలంలో పిచ్చిమొక్కలను తొలగించి చదును చేసే పనులను చేపట్టారు.
పనుల పరిశీలన
బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం చేపడుతున్న భూమి చదును పనులను జడ్పీ సీఈవో ప్రసూనరాణి, ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే గ్రామానికో పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించిందని, ప్రస్తుతం మండల ప్రజలకు 10 ఎకరాల స్థలంలో ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ పల్లె ప్రకృతి వనం పూర్తయితే మండల ప్రజలకు, పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు.