ములుగు జిల్లాలో లక్షా 20వేల మందికి వ్యాక్సిన్
వైరస్‌పై కలిసికట్టుగా పోరాటం
తగ్గుతున్న కేసుల సంఖ్య.. సర్కారు వైద్యంపై ప్రజల్లో ధీమా
2లక్షల 93వేల మందికి నిర్ధారణ పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా 16దవాఖానల్లో నిరంతర సేవలు
ములుగు, ఆగస్టు 20(నమస్తేతెలంగాణ) :ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ములుగు జిల్లా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కలిసికట్టుగా పోరాటం చేస్తున్నారు. మొత్తం మూడు లక్షల జనాభా ఉన్న జిల్లాలో 2021 జనవరి 16నుంచి ఇప్పటివరకు లక్షా 20వేల మందికి 16 దవాఖానల్లో ఉచితంగా వ్యాక్సిన్ వేశారు. కలెక్టర్, డీఎంహెచ్‌వో, ఇతర ఉన్నతాధికారులు గ్రామగ్రామాన ముమ్మర ప్రచారం చేసి ప్రజలు టీకాలు వేయించుకునేలా అవగాహన కల్పించారు. 2లక్షల 93వేల మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. కొవిడ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అందిస్తున్న వైద్యసేవలతో కేసులు సైతం తగ్గుముఖం పట్టడంతో ఇటు ప్రజలు సైతం భరోసాతో ఉన్నారు.
ప్రపంచా న్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు ప్ర భుత్వ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు 2 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. కరోనా కట్టడిలో భా గంగా 2021 జనవరి 16 నుంచి టీకాలు వేస్తున్నారు. జి ల్లాలోని 16 ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటివరకు లక్షా 20వేల మందికి కరోనా టీకాలు వేశారు. మొదట టీకాపై ప్రజల్లో అపోహలు నెలకొనగా కలెక్టర్, డీఎంహెచ్‌వో, ఉ న్నతాధికారులు, వైద్య సిబ్బంది గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించి ప్రజలు టీకాలు తీసుకునేలా అవగాహన కల్పించారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను జిల్లాలో ని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ములుగు, ఏ టూరునాగారం, వెంకటాపురం(నూగూరు) దవాఖానల ద్వారా ప్రజలకు అందించారు. ప్రతి రోజూ 2వేల మందికి టీకాలు వేయడం లక్ష్యం కాగా, ప్రజలు ముందుకు రాకపోవడంతో కేవలం రోజుకు 1000 మందికి మాత్రమే టీకాలు పంపిణీ చేశారు. జిల్లాలో 3 లక్షల మంది జనాభా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1లక్షా 9480 డోసుల వ్యాక్సిన్ అందించింది. ఇందులో 85 వేల డోసుల కొవిషీల్డ్, 25 వేల కొవాగ్జిన్ టీకాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రత్యేక టీకా కార్యక్రమంలో భాగంగా 1500 డోసులు అదనంగా కేటాయించారు.
కేసుల సంఖ్య తగ్గుముఖం..
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది కరోనా వైరస్ కట్టడికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుండడంతో జిల్లాలో రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సం ఖ్య తగ్గుతూ వస్తున్నది. నిరంతర ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటి వరకు 2లక్షల 93వేల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. 15,170మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 15,100మంది చికిత్స అనంతరం పూర్తి ఆరోగ్యవంతులుగా మారారు. వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు మొదట హెల్త్ కేర్ వర్కర్లకు టీకాలను పంపిణీ చేయగా మలివిడత ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఆ తర్వాత 60ఏళ్లు పైబడిన వారికి, తదుపరి 45 నుంచి 59 సంవత్సరాలు ఉన్న వారికి టీకాలు అందించారు. అనంతరం 18 నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి టీకాలు అందిస్తున్నారు. జిల్లాలో 85,700 మందికి మొదటి డోసు టీకాలను అందించగా 34300 మందికి 2వ డోస్ టీకాల పంపిణీని వైద్యారోగ్య శాఖ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం ఏర్పడింది..
కరోనా వైరస్‌పై పోరులో ప్రభుత్వ దవాఖానలు సంజీవనిలా పనిచేశాయి. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ వైద్యులు, సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రజల ఆరోగ్యంపై తీసుకున్న శ్రద్ధతో ప్రభుత్వ దవాఖాన వైద్యంపై వారికి నమ్మకం ఏర్పడింది. కరోనా రోగులతో పాటు ఇతర వ్యాధిగ్రస్తులు సైతం ప్రభుత్వ దవాఖానల దారి పడుతున్నారు. కేసులు తక్కువగా నమోదవుతున్నాయని కరోనాపై నిర్లక్ష్యం వద్దు. ప్రతి ఒక్కరూ విధిగా టీకాలు వేసుకొని వైద్య సిబ్బందికి సహకరించాలి.
-అల్లెం అప్పయ్య, డీఎంహెచ్‌వో, ములుగు