యాదవుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి
రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.6వేల కోట్ల నిధులు
రూ.20కోట్లతో యాదవులు, కురుమలకు ఆత్మగౌరవ భవనాలు
యాదవ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఓయూ వైస్‌చాన్స్‌లర్ రవీందర్యాదవ్కు సన్మానం
న్యూశాయంపేట, ఆగస్టు 19: కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం నిత్య ప్రోత్సాహం అందిస్తున్నదని, యాదవులు, కురుమల అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం హనుమకొండ హంటర్‌రోడ్‌లోని అభిరామ్ గార్డెన్లో యాదవ ఆత్మీయ సమ్మేళంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ డీ రవీందర్యాదవ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు విద్య, ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.6వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మరో రూ.20కోట్లతో గొల్ల, కురుమలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మించినట్లు తెలిపారు. గొర్రెల పెంపకంతో గొర్రెల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ప్రమాదంలో చనిపోతే గొర్రెకు రూ.5వేలు, పొట్టేలుకు రూ.7వేల బీమా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్‌లర్‌గా రవీందర్యాదవ్ను నియమించి యాదవులకు గుర్తింపునిచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. ఓయూ నూతన వీసీ రవీందర్‌యాదవ్ మాట్లాడుతూ.. అడుగకముందే వరాలు కురిపించే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. కష్టపడే గుణం, మాట తప్పని నైజం యాదవులదన్నారు. ఈ కార్యక్రమంలో కన్నెబోయిన రాజయ్యయాదవ్, సుందర్‌రాజ్‌యాదవ్, షైన్ విద్యాసంస్థల ప్రొప్రైటర్ కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు బొంగు అశోక్, కావటి కవిత, మామిండ్ల రాజు, బైరబోయిన ఉమ, మరుపల్లి రవి, జక్కుల రజిత, జక్కుల రవీందర్, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.