నగరంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పర్యటన
సర్వమత ప్రార్థనలు చేసిన ఎంపీ
భద్రకాళిలో పూజలు, కాజీపేట దర్గా, చర్చిలో ప్రార్థనలు, ఓరుగల్లు కోట సందర్శన
భద్రకాళిలో మాఢవీధుల నిర్మాణానికి చేయూతనిస్తానని హామీ
మట్టెవాడ/ఖిలావరంగల్/కాజీపేట, ఆగస్టు 13 : రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ శుక్రవారం వరంగల్‌లో పర్యటించారు. పలు ఆలయాలు, కాజీపేట దర్గా, చర్చిలను సందర్శించి మొక్కలు నాటారు. మొదట ఆయన స్థానిక నేతలతో కలిసి భద్రకాళీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వేదపాఠశాల ఆవరణలో మొ క్కలు నాటారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఆలయ మాఢవీధుల గురించి వేదపండితులతో చర్చించి, నిర్మాణానికి చేయూతనందిస్తానన్నారు. అక్కడి నుంచి ఖిలావరంగల్‌లోని ఓరుగల్లు కోటకు వెళ్లారు. స్వయం భూ శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలిసి పూజలు చేశారు. నూతన జిల్లా ఏర్పాటు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా కాకతీయుల కీర్తితోరణాల మధ్య మొక్కలు నాటారు. అనంతరం 48వ డివిజన్ పరిధి దర్గా కాజీపేటలోని బియాబాని దర్గాను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. వారికి దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా స్వాగతం పలికారు.
అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హరితహారంలో భాగంగా దర్గా ప్రాంగణంలో పలురకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఖుస్రూపాషా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎంపీ అదే ప్రాంతంలో ఉన్న సెయింట్ జోసెఫ్ కెథడ్రల్ చర్చిని సందర్శించి, ఆవరణలో మొక్కలు నాటారు. బిషప్ డాక్టర్ ఉడుముల బాల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నరేందర్, రాజయ్య, కూడా చైర్మన్ యాదవరెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్‌ఖాన్,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు సువర్ణాసురేశ్, ఉమాదామోదర్యాదవ్, షార్తాజ్ బేగం, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, ముస్లిం మత పెద్దలు, చర్చి విచారణ గురు వు మర్రెడ్డి, జోసెఫ్ పాల్గొన్నారు.