ములుగు, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మందు పాతర్లను అమర్చుతున్న ఆరుగురు మావోయిస్టులను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈ నెల 13న వెంకటాపురం(నూగూరు) మండలం తడపాల అటవీ ప్రాంతంలో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన మావోయిస్టులు, మిలీషియా సభ్యులు కర్రె గుట్టలపై గెరిల్లా బేస్ ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రజలు, పోలీసులను అటవీ ప్రాంతంలోకి రాకుండా ఉంచాలనే ఉద్దేశంతో కాలి బాటల వెంట మందు పాతర్లను అమర్చతున్నారని సమాచారం వచ్చిందన్నారు. దీంతో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా తడపాల గ్రామానికి వెళ్లే దారిలో మందు పాతర్లను అమర్చుతున్న మావోయిస్టులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారన్నారు.
ఈ క్రమంలో పోలీసులు ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పట్టుకొని వారి వద్ద నుంచి ఒక డీబీబీఎల్ తుపాకీ, నాలుగు కిట్ బ్యాగులు, రెండు వాకీటాకీలతో పాటు పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా ఇందులో వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ డిప్యూటీ దళ కమాండర్ కారం బుద్రి అలియాస్ రీతాతో పాటు పామేడు ఏరియా కమిటీ సభ్యురాలు సోడి కోసి అలియాస్ మోతె, బెటాలియన్ సభ్యుడు సోడి విజయ్ అలియాస్ ఇడుమ, మిలీషియా సభ్యులు కుడం దస్రు, సోడి ఉర్ర, మడకం భీమాలుగా తేలిందన్నారు. కారం బుద్రి అలియాస్ రీతాపై మొత్తం 30 కేసులున్నాయని, అందులో మాడూరి భీమేశ్వర్రావు, కొరుస రమేశ్, ఇల్లందుల ఏసును హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్నారన్నారు. సోడి కోసి అలియాస్ మోతెపై ఆరు కేసులు ఉన్నాయని, సోడి విజయ్‌పై నాలుగు, కుడం దస్రు, సోడి ఉర్ర, మడకం భీమపై ఆరు చొప్పున కేసులున్నాయని తెలిపారు. సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ మహేష్ గీతే, డీఎస్పీ రవీందర్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.