ములుగు, మే30(నమస్తేతెలంగాణ) : మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న ములుగును గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాగా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏకైక గ్రామపంచాయతీగా ఉన్న ములుగు జిల్లా కేంద్రంగా ఉండగా నాటి ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని సవరణ చేసి ములుగు జీపీని మున్సిపాలిటీగా మార్చేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మాణం చేసి ఆమోదించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మున్సిపాలిటీ ఏర్పాటు నిలిచిపోయింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా ఏడాదిన్నర అనంతరం ప్రస్తుతం ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ కమీషనర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి ఈ నెల 28వ తేదిన జీవో నంబర్ 801298-3/2025/ఎఫ్1ను విడుదల చేశారు. 29వ తేది నుండి ములుగు, జీవింతరావుపల్లి, బండారుపల్లి గ్రామాల పరిధిలలో మున్సిపల్ చట్టాలు అమలులోకి వస్తాయని జీవోలో పొందుపర్చారు.
మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 53లో పేర్కొన్న విధులను నిర్వహించేందుకు ములుగు మున్సిపాలిటీని గ్రేడ్-3 అధికారిని ములుగు మున్సిపల్ కమీషనర్‌గా నియమించాలని జీవోలో సూచించారు. అందుకు అనుగుణంగా పోస్టింగ్ కోసం వేచి ఉన్న గ్రేడ్-3 అధికారి అయిన జె. సంపత్‌ను ములుగు మున్సిపాలిటీ కమీషనర్‌గా నియమించారు. అదేవిధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమీషనరేట్ పరిధిలో టాక్సేషన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వై. రామకృష్ణను ములుగు మున్సిపల్ టాక్సేషన్ ఆఫీసర్‌గా నియమించారు.
29 నుండి అమల్లోకి వచ్చిన మున్సిపల్ చట్టాలు
తెలంగాణ మున్సిపాల్ 2019 ప్రకారం ములుగు మున్సిపాలిటీ ఏర్పడగా ఈ నెల 29వ తేది నుండి ములుగు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ చట్టాలు అమలులోకి వచ్చాయి. మున్సిపాలిటీ పరిధిలో జమ ఖర్చులు నిర్వహించేందుకు ‘ ములుగు మున్సిపాలిటీ మున్సిపల్ కమీనర్’ పేరుతో జాతీయం చేయబడిన ఏదైనా బ్యాంకులో కొత్త ఖాతాను తెరవడంతో పాటు ప్రస్తుతం ములుగు గ్రామపంచాయతీ పేరుతో ఉన్న ఖాతాలను ముసివేయనున్నారు. కార్యాలయ భవనంతో పాటు ఇతర బోర్డులపై ములుగు మున్సిపాలిటీ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.
ములుగు మున్సిపాలిటీ పేరుతో పరిష్కరించాల్సిన తీర్మాణాల ప్రయోజనాల కోసం తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 కింద నమోదు చేసేందుకు కొత్త మినిట్స్ బుక్‌ను తెరవనున్నారు. గ్రామపంచాయతీల వివరాలతో పాటు అందులో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను, జీపీల పరిధిలోని స్థిర,చరరాస్తుల వివరాలను చూపించే ప్రకటన, గ్రామపంచాయతీ పన్నులతో పాటు పన్నులు కాని వాటిని చూపించే ప్రకటన, జీపీ పరిధిలలో కొనసాగుతున్న పథకాల వివరాలు, చెల్లించాల్సిన పన్నులు, సామగ్రి వివరాలను నమోదు చేయనున్నారు. గత 3 సంవత్సరాలలో జీపీల పరిధిలో నిర్మాణమైన భవనాలు, లేఔట్ అనుమతులను మున్సిపల్ పరిధిలోకి మార్చనున్నారు. పైన పేర్కొన్న వివరాలన్నింటిని నివేదిక రూపంలో ఈ నెల జూన్ 10వ తేదిలోగా ప్రభుత్వానికి మున్సిపాలిటీ కమీషనర్ సమర్పించాల్సి ఉంటుంది.
20 వార్డులతో మున్సిపాలిటీ ఏర్పాటు
ములుగు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బండారుపల్లి, జీవంతరావుపల్లి జీపీలను విలీనం చేసి 20 వార్డులతో ములుగు మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ములుగు గ్రామపంచాయతీ పరిధిలో పాల్‌సాబ్‌పల్లి, రంగారావుపల్లి, ప్రేమ్‌నగర్, మాధవరావుపల్లి గ్రామాలు ఉన్నాయి. జీవంతరావుపల్లిలో గణేష్లాల్పల్లి శివారు గ్రామం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ములుగులో 16వార్డులు, 4 శివారు పల్లెలతో కలుపుకొని 12,135 జనాభా 9422 ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా బండారుపల్లిలో 12వార్డులలో 3187 జనాభా 2,436 ఓటర్లు ఉన్నారు. జీవంతరావుపల్లి గ్రామంలో శివారు పల్లెతో కలుపుకొని 8వార్డులు, 1,211 జనాభా 628ఓటర్లు ఉన్నారు.