ములుగు, మార్చి14 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. కాగా ఆమె మృతికి ఓ కాంగ్రెస్ నేత కొడుకు వేధింపులే కారణమని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యా దు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం(నూగూరు) మండలం అలుబాకకు చెందిన సుంకర వెంకటసుబ్బారావు కుమార్తె సాహితి(21) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.
గురువారం ఆమె తండ్రి వెంకటసుబ్బారావుతో పాటు కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లి ఆత్మహత్యకు గల కారణాలను మీడియాతో పాటు పోలీసులకు వివరించారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ చిడెం మోహన్రా వు కొడుకు హరీశ్ తమ కుమార్తెను మానసికంగా వేధించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్పారు.
ఈ విషయాన్ని తమ కుమార్తె హరీ శ్ తండ్రి మోహన్‌రావుకు చెబితే ‘ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని బెదిరించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎవరికీ చెప్పుకోలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని బోరున విలపించారు. తండ్రి రాజకీయ అండ చూసుకొని తమ కుమార్తె చావుకు కారణమైన హరీశ్‌పై చర్య లు తీసుకోవాలని కోరారు. గురువారం రాత్రి సాహితి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా, గ్రామస్తులు, స్నేహితులు కలిసి ర్యాలీ తీసి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.