ములుగు, సెప్టెంబర్20(నమస్తేతెలంగాణ): ములుగు జిల్లాలో వానకాలం ధాన్యం సేకరణకు రైస్‌మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ఈ మేరకు తమను భాగస్వామ్యం చేయవద్దని గురువారం రైస్ మిల్లర్లు కలెక్టర్ టీఎస్ దివాకరను కలిసి మెమోరాండం సమర్పించారు. 2025 జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రాష్ట్ర రైస్ మిల్లు నాయకులను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, సన్నవడ్ల నుంచి 67 శాతం బియ్యాన్ని ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు. సగటున క్వింటా సన్నవడ్లకు 59 కిలోలకు మించి బియ్యం రావని, తరుగు ఉత్పత్తులు అమ్మగా వచ్చే పైసలు తరుగు ధాన్యం క్వింటా రూ. 2800 చొప్పున కొనుగోలు చేసేందుకు కూడా సరిపోక మిల్లర్లు భారీ స్థాయిలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌కు బాకీ పడే అవకాశాలున్నాయన్నారు. సన్నవడ్లు 17శాతం తేమతో 45 రోజుల వరకు మాత్రమే రంగు మారకుండా ఉంటాయని, ఐదో నెలలో సీఎంఆర్‌కు పనికి రాకుండా పోతాయన్నారు. మిల్లింగ్, ట్రాన్స్‌పోర్టు, డ్రైయేజి, కస్టోడియన్ చార్జీలు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదని, అవి ప్రభుత్వం ఇస్తే తాము సీఎంఆర్ బకాయిని పూర్తిగా చెల్లిస్తామంటున్నారు.
సివిల్ సప్లయ్ కమిషన్‌కు ఏకరువు
రాష్ట్ర కమిటీతో కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆగస్టు 27వ తేదీన సివిల్ సప్లయ్ కమిషనర్‌కు ఏకరువు పెట్టామని, నెల రోజులు కావస్తున్నా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని మిల్లర్లు చెబుతున్నారు. పదేళ్లలో కరెంట్, హమాలీ చార్జీలు, వర్కర్ల వేతనాలు, మిల్లు స్పేర్‌పార్టుల ధరలు మూడింతలు పెరిగాయని, తమకు బిల్లింగ్ చార్జీలు పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఒక క్వింటా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐ గోదాంలకు పంపించాలంటే వచ్చే ఖర్చు ధాన్యం తేమ తరుగుతో కలుపుకొని రూ. 547 అవుతుందని, అదే పద్ధతిన ఉప ఉత్పత్తులను మార్కెట్ ధర ప్రకారం అమ్మితే వచ్చే మొత్తం రూ.447 వస్తుందన్నారు. ఈ లెక్కన క్వింటా ధాన్యానికి రూ.100 వరకు నష్టం వస్తుందని, ఈ కారణంగానే రైస్ మిల్లర్లు అంతా డిఫాల్టర్లుగా మారి సీఎంఆర్‌ను సకాలంలో అందించ లేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ కారణాలతో వానకాలంలో ధాన్యం కొనుగోళ్లలో భాగస్వామ్యం అయ్యేందుకు సుముఖంగా లేమని తెలియజేశారు. క్వింటా సన్నవడ్ల మిల్లింగ్‌కు రూ.150, దొడ్డు వడ్లకు రూ.100 చొప్పున చెల్లిస్తూ 14తేమ శాతంతో వడ్లు ఇచ్చిన మొదటి రోజు నుంచి మిల్లింగ్ ప్రారంభించి పాత గన్నీ సరైన రేటును నిర్ణయించి రావాల్సిన బకాయిలన్నింటిని చెల్లించినట్లయితే వానకాలం ధాన్యం కొనుగోళ్లలో పాల్గొంటామని తేల్చిచెబుతున్నారు
రైసుమిల్లుల్లో బియ్యం మాయం
ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్‌లో రైస్‌మిల్లుల యజమానులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యాన్ని మాయం చేశారు. ఎల్కతుర్తి మం డలం పెంచికల్పేటలోని శ్రీబాలాజీ, ఐనవోలు మండలంలోని పున్నేల్ గ్రామంలోని నారాయణ ఆగ్రో ఇండస్ట్రీ, మరిపెడ మండ లం యల్లంపేట వద్ద గల లక్ష్మీ పారా బాయిల్డ్ మిల్లుల్లో శుక్రవారం సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. మిల్లు లో నిల్వ ఉన్న సీఎంఆర్ ధాన్యాన్ని లెక్కించగా భారీ ఎత్తున బస్తాలు మాయమైనట్లు తేలింది. ఈ సందర్భంగా సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేకాధికారి ఎల్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బాలాజీ మిల్లు ప్రభుత్వానికి సీఎంఆర్ కింద 3521 టన్నులు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 205 టన్నులు, నారాయ ణ ఆగ్రో ఇండస్ట్రీ 58 వేల బస్తాలు ఇవ్వాల్సి ఉండగా, 7641 బస్తాలు మాత్రమే నిల్వ ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యం మిల్లులకు ఒక అవకాశం ఇచ్చిందని, ధాన్యం లేనియెడల డబ్బులైనా ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి గడువు ఇచ్చిందన్నారు. అయినప్పటికీ మిల్లుల యజమానులు స్పందించకపోవడంతో ఈ దాడులు చేస్తున్నట్లు వివరించారు. మిల్లు యజమానులపై క్రిమినల్ కేసులకు సిఫారసు చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీటీసీఎస్ నాగేంద్రప్రసాద్, ఎఫ్ఐ మోటం సదానందం, టీఏ కనకాచారి ఉన్నారు.