భీమదేవరపల్లి, జూలై 28: ముల్కనూరు మహిళా సహకార డెయిరీ సభ్యులు మరింత ఆర్థిక ప్రగతి సాధించాలని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షులు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం ముల్కనూరు మహిళా సహకార డెయిరీ ప్రధాన కార్యాలయంలో 23వ వార్షిక మహాసభ జరిగింది. మొదటగా డెయిరీ జీఎం మారుపాటి భాస్కర్‌రెడ్డి వార్షిక బడ్జెట్‌ను చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు ముల్కనూరు మహిళా డెయిరీలోనే లభిస్తాయని కొనుగోలు దారులు చెప్పడం అభినందనీయమన్నారు. పాలసంఘాల్లో అధ్యక్ష, కార్యదర్శులు మానిటరింగ్ చేయడం, ఏమైనా సమస్యలు తలెత్తితే సూపర్వైజర్లు అక్కడే పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఆవు పాలకంటే గేదె పాలకే మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. గేదె పాలు పెంచేందుకు సభ్యులు మరింత కృషి చేయాలని చెప్పారు. పాల ఉత్పత్తుల వల్ల వ్యాపారంలో వచ్చిన లాభాన్ని సభ్యులకు రూ.15కోట్లు బోనస్‌ను డెయిరీ జీఎం మారుపాటి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. డెయిరీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ. 123కోట్లు బోనస్‌ను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సభ్యుల పరస్పర సహకారం వల్లనే డెయిరీ దినదినాభివృద్ది చెందుతుందన్నారు. సభ్యులు మరణిస్తే దహనసంస్కారాల నిమిత్తం రూ. 5వేలను రూ. 7500, సహజ మరణం సంభవిస్తే రూ. 25 నుంచి రూ. 35వేలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 50 నుంచి రూ. 75వేలకు పెంచుతున్నట్లు ప్రకటించగా సభ్యులు ఆమోదం తెలిపారు.
ఉత్తమ సంఘాలకు మెమొంటోలు ప్రదానం
పాల పరిమాణంలో వంగర, సహకార పద్దతుల్లో భీమదేవరపల్లి, సంఘంతో సభ్యుల లావాదేవీలు ముత్తారం తండ, పాడిపశువుల నిర్వహణలో ఉల్లంపల్లి, సంఘ ఆర్థిక లావాదేవీల్లో ఇందిరానగర్ సంఘాలు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాయి. ఈ పాలసంఘాల అధ్యక్షులకు ముల్కనూరు సహకార పరపతి సంఘం అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, డెయిరీ డైరెక్టర్లు మెమొంటోలు ప్రధానం చేశారు. అనంతరం అత్యధికంగా గేదె పాలు పోసిన అలుగు రజిత(ముల్కనూరు-2), బత్తుల వాణి(పందిల్ల), ఆవుపాలు పోసిన గుజ్జ అరుణ(సిర్సపల్లి), గుజ్జేటి సరిత(గోపాల్పూర్)లను సన్మానించారు.
మూడు వార్డులకు ఎన్నికలు ఏకగ్రీవం
ముల్కనూరు మహిళా సహకార డెయిరీలో 12 డైరెక్టర్ స్థానాలుండగా 2,5,11 వార్డులకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. 2లో మేడిదుల సునిత(జీల్గుల), 5లో గుజ్జ రమాదేవి(గోపాల్పూర్-2), 11లో కాశబోయిన లావణ్య(అక్కన్నపేట) ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్లు జంపాల రాజేశ్వరీ, నల్లాల సులోచన, పింగిళి రజిత, దొంతరబోయిన రజిత, మామిడాల శోభారాణి, కర్ర రమాదేవి, కత్తుల కవిత, పెద్దవేన అరుణ, గుండెల్లి రజిత, కొండం సుజాత, గుగులోతు సుజాత, ఎస్బీఐ, కెనరా బ్యాంకు మేనేజర్లు నాగరాజు, సాయిచరణ్, పాల సంఘాల అధ్యక్షులు, సిబ్బంది పాల్గొన్నారు.