నల్లబెల్లి, మార్చ్ 17 : ఎమ్మార్పీఎస్(MRPS) మండల కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న దీక్షను తాజా మాజీ సర్పంచ్ నానబోయిన రాజారాం నాయకులకు పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు బోట్ల ప్రతాప్ హాజరై మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా మందకృష్ణ జరుపుతున్న పోరాటంలో మాదిగ హాక్కులే కాకుండా ప్రజా హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేసిన త్యాగశీలి అన్నారు.
అయితే సుదీర్ఘమైన ఎస్సీ వర్గీకరణ పోరాటం చివరి దశకు చేరుకున్న సందర్భంగా ఎ.బి. సి .డి వర్గీకరణకు చట్టసభలో చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అంతవరకు గ్రూప్-2 గ్రూప్-3 ఫలితాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాదిగ దండోరా, మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టిందని అవగాహన లేనివారు సృష్టించి ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తామంతా ఏకమై ఐక్యంగా వాటిని తిప్పికొట్టాలని దళిత వర్గాలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బొమ్మకంటి అనిల్, పరికి కోర్నెల్, మండల్ ప్రధాన కార్యదర్శి నత్తి శ్యామ్, మండల అధికార ప్రతినిధి పోలేపాక అరుణ్, అడ్డ రాజు,బోట్ల దయాకర్, కొయ్యల సుదర్శన్, రాజయ్య పాల్గొన్నారు.