ములుగు, మార్చి 22 (నమస్తేతెలంగాణ) : పశ్చిమాసియా యుద్ధం కారణంగా ములుగులో ఇంధన కొరత ఏర్పడింది. ములుగు పట్టణంతోపాటు సమీపంలోని జాకారం, బండారుపల్లి, జంగాలపల్లిలో ఏడు పెట్రోల్ బంకులు ఉండగా, కేవలం ఒక్క బంక్‌లో మాత్రమే పెట్రోల్, డీజిల్ లభిస్తున్నది. దీంతో సరిపడా పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ద్విచక్రవాహనదారులు, ఫోర్ వీలర్స్, త్రీ వీలర్స్‌తో పాటు ట్రాక్టర్లు, లారీ యజమానులు డీజిల్, పెట్రోల్ కోసం అవస్థలు పడుతున్నారు. రైతుల పంట పొలాలకు నీరందించేందుకు ఆయిల్ ఇంజిన్లకు డీజిల్ అవసరం కాగా, వారు కూడా ఇబ్బందిపడుతున్నారు. ములుగు పట్టణంలో నాలుగు పెట్రోల్ బంక్‌లుండగా పత్తిపల్లి రోడ్డు లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్, తిరుమల థియేటర్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంక్ మూతపడ్డాయి.
ప్రేమ్‌నగర్ వద్ద ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌లో మాత్రమే పెట్రోల్, డీజిల్ లభిస్తుండటంతో వాహనదారులు బారులు తీరారు. ఐటీడీఏకు చెందిన బండారుపల్లిలోని ఐవోసీ పెట్రోల్ బంక్ సైతం బంద్ చేయడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందా? లేక బంక్ యజమానులు కావాలని మూసేసి కృత్రిమ కొరత స్పష్టిస్తున్నారా? అని వాహనదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే కొరత ఉంటే బంక్‌ల్లో పెట్రోల్ ఉన్నా రేట్లు పెంచే అవకాశం ఉందని పోయడం లేదా? అని మండిపడుతున్నారు. ఏదేమైనా ఇంధన కొరత కారణంగా వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.