బచ్చన్నపేట సెప్టెంబర్ 25 : రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ వద్ద తెలంగాణ రైతు సంఘం మండల మహాసభకు హాజరై మాట్లాడారు. వానాకాలం సీజన్లో రైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు పూర్తిగా వెనకబడ్డారని అన్నారు. రైతులు ప్రైవేటులో అధిక వడ్డీకి అప్పులు చేసి పంటలు సాగు చేయాల్సి వస్తుందని అన్నారు.
వానాకాలం సీజన్లో బ్యాంకుల ద్వారా రూ. 54,480 కోట్ల పంట రుణాలు పంపిణీ చేస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించిందని, కానీ రూ. 44,438 కోట్లు రుణాలను మాత్రమే రైతులకు అందజేశారని అన్నారు. రుణమాఫీ పథకం వర్తించని రైతులకు మాత్రమే పంట రుణాలు అందజేసి, రుణమాఫీ పొందని రైతులకు మంజూరు చేయలేదని అన్నారు. ఆగస్టు 25, 28 తేదీలలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో 2.50 లక్షల ఎకరాల్లో పంట నష్టాలను ప్రభుత్వం అంచనా వేసి పరిహారం చెల్లించకపోవడం విడ్డూరమన్నారు. కౌలు రైతులకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం రాష్ట్రాల హక్కుగా ఇచ్చిన సహకారాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటుందని అన్నారు.
దిగుమతి సుంకం ఎత్తివేస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రమాదకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాపర్తి సోమయ్య, భూక్యా చందు నాయక్, మండల నాయకులు బెల్లంకొండ వెంకటేష్, ఎడబోయిన రవీందర్ రెడ్డి, రావుల రవీందర్ రెడ్డి, పొన్నాల రాజవ్వ, కొత్తపల్లి బాలనర్సయ్య బోడపట్ల బాలరాజు,మిల్లపురం ఎల్లయ్య, ముచ్చన్నపల్లి కుమార్ నడిగొట్టు నర్సింహులు, ఉప్పల గాలయ్య,గుడికందుల కనకయ్య,చొక్కం సులోచన, బాదెంగుల బాలరాములు, గజ్వెల్లి రమేష్,తదితరులు పాల్గొన్నారు.