వరంగల్, జూలై 14 : కుల వృత్తులను ప్రోత్సహించాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 2 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ల్యాండ్రో మార్ట్ (మోడ్రన్ దోబీ ఘాట్) విప్పలేని చిక్కుముడిగా మారింది. దీని నిర్మాణం వరంగల్ జిల్లాలోని పోతననగర్‌లో జరిగినా.. హనుమకొండ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఇది ఉండడంతో నిర్వహణ బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలన్నది తేలక నలిగిపోతున్నది. రూ. 2 కోట్ల నిధులతో నిర్మాణం పూర్తి చేసినా మూడేళ్లుగా నిరుపయోగంగానే ఉంటున్నది.
2023 ఆక్టోబర్‌లో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ల్యాం డ్రో మార్ట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ల్యాండ్రోమార్ట్ను వినియోగంలోకి తీసుకురావాలన్న ఆలోచన చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం పూర్తిగా విఫలమయ్యారు. దీని నిర్వహణ కోసం బల్దియా అధికారు లు అదే ఏడాది డిసెంబర్లో హనుమకొండ జిల్లా బీసీ కార్పొరేషన్‌కు లేఖ రాయగా, రెండు జిల్లాల స మస్యతో అధికారులు చేతులెత్తేశారు. ఆ తర్వాత మె ప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు అప్పగించేందుకు ప్రయత్నించగా వారు కూడా ముందుకు రాకపోవడంతో లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన అత్యాధునిక వాషింగ్ మిషన్లు, డయ్యర్లు, ఇతర యంత్రాలు తుప్పు పట్టి పనిచేయని స్థితికి చేరుకుంటున్నాయి.
వరదనీటిలో మునుగుతూ..
ప్రతి వానకాలంలో వరదలు నగరాన్ని ముంచెత్తుతుండడంతో ల్యాండ్రోమార్ట్ కూడా మునిగి తేలుతున్నది. గత ఏడాది వచ్చిన వరదల్లో సగానికి పైగా ల్యాండ్రోమార్ట్ మునిగిపోయింది. అప్పటి నుంచి కనీసం దాని షట్టర్లు కూడా తెరవలేదు. అందులోని లక్షల విలువ చేసే మిషన్ల పరిస్థితిని అధికారులు పరిశీలించలేదు. వరద నీటిలో మునిగిన మిషన్లు, మూడేళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో ప్రస్తుతం వాటి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇటీవల బల్దియా ఆధికారులు ల్యాండ్రోమార్ట్ను రజక సంఘాలకు లీజ్‌పై ఇస్తామని నిర్ణయించారు. మిషన్ల పరిస్థితి తెలియకుండా లీజ్‌కు తీసుకునేందుకు రజక సంఘాలు ముందుకు రాలేదు. ఇప్పటికైనా బల్దియా అధికారులు ల్యాండ్రోమార్ట్ను తెరిచి మిషన్లు పని చేస్తున్నాయా? లేదా? అనేది పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.
కనుమరుగవుతున్న దోబీ ఘాట్లు
రోజు రోజుకు విస్తరిస్తున్న నగరంలో చెరువు, కుం టలు మాయమవుతున్నాయి. నగరంలో దోబీఘాట్ లు కనుమరుగవుతున్నాయి. దీంతో నగరంలో రజక వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయి. అయితే ఆయా కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభు త్వం ప్రతిరోజు 1,100 జతలకు బట్టలుతికే సామర్థ్యంతో ల్యాండ్రోమార్ట్ను ఏర్పాటు చేయగా, కాంగ్రె స్ సర్కారు నిర్లక్ష్యంతో అది మూలన పడింది. అధికార పార్టీలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మె ల్సీ ఉన్నప్పటికీ దీనిని పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ల్యాండ్రోమార్ట్ను తెరిపించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.