యాదాద్రి భువనగిరి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): నేతన్నల పొదుపు పథకం ఒకడుగు ముం దుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా అమలవుతున్నది. ప్రభుత్వ అలసత్వం వల్ల చేనే త చేయూత పథకం నీరుగారుతున్నది. గతంలో మూడేండ్ల పాటు ఉన్న పథకానికి కోత పెట్టి రెం డేండ్లకు కుదించి నేతన్నల పొట్ట కొడుతున్నది. నేత కార్మికులు నెలనెలా డబ్బులు బ్యాంకులో జమ చేస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేస్తున్నది. 14 నెలలుగా సర్కారు తన వాటా చెల్లించకుండా మొండికేస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలను అన్ని విధాలా ఆదుకున్నది. ఉపాధి లేక వలస వెళ్లిన కార్మికులకు చేయూతనిచ్చింది. కార్మికుల సామాజిక భద్రత కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేనేత పొదుపు పథకానికి (తెలంగాణ హ్యాం డ్లూమ్ వీవర్స్, థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్, సెక్యూరిటీ స్కీం) శ్రీకారం చుట్టారు. నేత కార్మికుల నెలవారీ ఆదాయంలో ప్రధాన కార్మికులు 8 శాతం అంటే రూ.1200 పొదుపు చేస్తే ప్రభుత్వం 16 శాతం (రూ.2400) వాటాను బ్యాంకుల్లో జమ చేస్తుం ది. ఇక అనుబంధ కార్మికులకు రూ. 800 చెల్లిస్తే.. సర్కారు రూ. 1600 చెల్లిస్తుంది. ఆ మొత్తం నగదును వడ్డీతో సహా రెండేండ్ల తర్వాత నేతన్నలకు అందిస్తారు.
అయితే కాంగ్రెస్ వచ్చాక కొన్నాళ్ల పాటు పెండింగ్‌లో ఉంచింది. ఆతర్వాత గతేడాది ఏప్రిల్‌లో కొత్త పథకాన్ని పొడిగించింది. 2027 మార్చితో పథకం కాల పరిమితి ముగుస్తుంది. అయితే చేయూత స్కీంకు కాంగ్రెస్ కోత లు పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 నెలల పాటు ఉన్న పథకాన్ని 24 నెలలకు కుదించింది. 36 నెలలపాటు చేనేత కార్మికులు తమ వాటా చెల్లిస్తే.. ప్రభుత్వ రెండింతలు కట్టేది. మూ డేండ్ల తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చేవి. ఇప్పుడు కోతతో నేతన్నలకు పూర్తి స్థాయి ఫలాలు అందకుండా పోతున్నాయి.

కాంగ్రెస్ సర్కారు నేతన్నలపై నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇందుకు ఉదాహరణే నేతన్న చేయూత పథకం. స్కీం ప్రారంభమైన రెండు నెలలు మాత్రమే బ్యాంకు ఖాతాల్లో తన వాటాను జమ చేసింది. ఆ తర్వాత నిధులు లేకపోవడంతో చేతులెత్తేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో పొదు పు పథకంలో 10,900 కార్మికులు ఉన్నారు. సర్కారు ప్రతి నెలా రూ.2.17 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉంది. కానీ 14 నెలలుగా ఒక్క పైసా వేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
గతేడాది జూన్ నుంచి ప్రభుత్వ వాటా జమ కావడంలేదు. అంటే ఒక్క యాదాద్రిలోనే రూ.30 కోట్ల పైనే బకాయి పడింది. మరోవైపు నేతన్నలు మాత్రం తమ వాటాను నెలనెలా చెల్లిస్తున్నారు. ప్రధాన కార్మికుడితోపాటు అనుబంధ కార్మికుడి వంతును జమ చేస్తున్నారు. అయితే సర్కార్ తీరుతో పథకం నిలిచిపోతుందా అనే ఆందోళనలో కార్మికులు ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో పొదుపు పథకం నిధులు విడుదల చేయాలని నేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
మా కుటుంబానికి మగ్గమే జీవనాధారం. మగ్గం నేయగా వచ్చిన ఆదాయంలో ప్రతి నెలా పొదుపు పథకంలో ఆర్డీ 1 వాటా చెల్లిస్తున్నాం. కరోనా సమయం లో థ్రిఫ్ట్ పథకం మా కుటుంబానికి ఎంతో ఆసరా అయ్యింది. కాంగ్రెస్ వచ్చాక సరిగా ఆర్డీ2 వాటాను జమ చేయడం లేదు. ప్రభుత్వం నెలనెలా థ్రిఫ్ట్ డబ్బు జమ చేయాలి.
– సంగెం రఘు, చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి
నేత కార్మికుల పోరాటంతోనే కాంగ్రెస్ సర్కారు పొదుపు పథకాన్ని మళ్లీ పునరుద్ధరించింది. గతంలో 36 నెలలు ఉన్న స్కీంను 24 నెలలకు కుదించింది. ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి.. ప్రతి నెలా చెల్లింపులు చేయాలి. ఆర్డీ 2 ఖాతాలో డబ్బులు జమ చేసి నేత కార్మికులను ఆదుకోవాలి.
– సీత శ్రవణ్, చేనేత కార్మికుడు, భూదాన్ పోచంపల్లి