నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఉరుములు, మెరుపులతో మోస్తరు వాన కురిసింది. ప్రదాన రహదారులు, లో తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇన్ని రోజులు ఎండ, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు శనివారం కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు. ముఖ్యంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. దుక్కులు దున్నుకొని విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం, మండలం, వాజేడు మండల కేంద్రంతోపాటు ప్రగళ్లపల్లి, ఆర్గుంటపల్లి, కొప్పుసూరు, జగన్నాథపురం, జంగాలపల్లి, గుమ్మడిదొడ్డి భారీ వర్షం కురిసింది. మంగపేట మండలం కమలాపురం ఆర్పీహెచ్ కాలనీలో కందాల భాస్కర్ అనే వ్యకికి చెందిన పూరిల్లు కూలిపోయింది. తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామంలో పిడుగుపాటుతో 21ఆవులు, దుక్కిటెద్దు మృత్యువాత పడ్డాయి. జనగామ జిల్లాలో 9.9 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.