మహబూబాబాద్ రూరల్, జనవరి 22 : ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మరోసారి మోసం చేస్తున్నదని, రెండు రోజులుగా నిర్వహిస్తున్న గ్రామ సభలతో ఒరిగేదేం లేదని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. బుధవారం మహబూబాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి పాలనలో మార్పు తెస్తామని, అధికారంలోకి వచ్చాక నిరుపేదల సమస్యలను పూర్తిగా విస్మరించిందన్నారు.
గ్రామ సభల్లో అధికారులు కేవలం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ, రైతు భరోసా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు చదువుతున్నారని పేర్కొన్నారు.దీని వల్ల అధికారుల సమయం, ప్రజాధనం వృథా అవుతున్నదన్నారు. జాబితాల్లో అనర్హులు ఎక్కువ మంది ఉన్నారని, నిజమైన లబ్దిదారులను సంక్షేమ పథకాలకు ఎంపిక చేయలేదన్నారు. కాంగ్రెస్ నాయకులను మాత్రమే ఎంపికచేసి నిరుపేదలను విస్మరించారని, అధికారం చేపట్టి పదమూడు నెలలైనా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన తులం బంగారం, వృద్ధులకు ఆరు వేల పెన్షన్, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ, స్కాలర్ షిప్ వంటివి ఇంకా అమలు చేయలేదన్నారు. రేవంత్‌రెడ్డి ఎప్పుడూ బోగస్ మాటలతోనే కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి పేద వాడికి లబ్ధి జరిందన్నారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తక్కళ్లపల్లి పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, వార్డు కౌన్సిలర్ వేణుమాధవ్, రామకృష్ణ, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.