మహబూబాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వృత్తిపరమైన భద్రత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సక్షేమం తదితర అంశాలపై దశాబ్ధాలుగా డిమాండ్ చేస్తున్నారని, వారి సమస్యలను మానవీయ కోణంలో చూడాలన్నారు. బుధవారం ఆయన శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ వృత్తిపరంగా ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండే జర్నలిస్టులు వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటున్నారు? పిల్లల చదువులు, ఆరోగ్యానికి ఎలా ఖర్చు పెడుతున్నారనేది చూస్తే బాధాకరంగా ఉంటుందన్నారు.
జర్నలిస్టుల అరకొరగా ఉన్న తమ జీతాలు పెంచాలని ధర్నా చేయలేరని, యాజమాన్యాన్ని అడగలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉపాధి కల్పించకపోవడంతో చాలామంది జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకొని రాణిస్తున్నారని, వారిని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వారికిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రపంచానికి చాటే జర్నలిస్టులు తమ బాధలు ఎవరికి చెప్పుకోలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించి వారి సమస్యలను శాశ్వతంగా పరిషరించాలని డిమాండ్ చేశారు.
జీవో నంబర్ 252 ప్రకారం చాలామంది ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు రావడం లేదని, అందరికీ అందించేలా చూడాలన్నారు. అలాగే హెల్త్ కార్డులు, పిల్లలకు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత విద్య అందించాలన్నారు. అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో హెల్త్ కార్డులు పనిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని, అలాగే వెల్ఫేర్ ఫండ్‌తో పాటు అర్హులకు పెన్షన్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వారికిచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని, లేదంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తామని తక్కళ్లపల్లి అన్నారు.
యాప్‌తో రైతులకు తిప్పలు
యూరియా యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో బస్తాలు దొరకక దిగబడి తగ్గుతున్నదని తక్కళ్లపల్లి అన్నారు. కేవలం పీఏసీఎస్ ద్వారానే యూరియా పంపిణీ చేస్తున్నారని, ఎరువుల కొరత లేదని మంత్రి అంటున్నారని, అలాంటప్పుడు ఈ యాప్ ఎందుకన్నారు. యాప్ ద్వారా చదువుకున్న రైతులే బుక్ చేయలేకపోతున్నారని, అలాంటిది చదువుకోని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్కజొన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.