మహబూబాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : గిరిజన రైతుల ధర్నాకు తాము అనుమతి కోరితే పోలీసులు హైడ్రామా చేశారని, ఎస్పీపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి అనుమతి నిరాకరించినట్లు స్పష్టమవుతోందని ధర్నాను అడ్డుకోవడం అవివేకమని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. లగచర్ల నుంచి రేవంత్‌రెడ్డి పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.
గురువారం ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్‌తో కలిసి మహబూబాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానుకోటలో 144 సెక్షన్ పెట్టి కర్ఫ్యూను తలపించే విధంగా చేశారన్నారు. జిల్లా ఎస్పీ శాంతిభద్రతల పేరుతో ధర్నా కార్యక్రమానికి అనుమతి నిరాకరించారని తెలిపారు. అలాగే కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని, రాళ్లతో దాడి చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎస్పీ వెంటనే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మారినేని వెంకన్న, యాకుబ్‌రెడ్డి, ఫరీద్, జేరిపోతుల వెంకన్న, భారత రవికుమార్, మంగళంపల్లి కన్న, ఎట్లా వేణు, పరకాల శ్రీనివాస్‌రెడ్డి, యాల మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.
గిరిజన రైతు ధర్నా నిర్వహిస్తామంటే అనుమతి నిరాకరించిన పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారు. మేము పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుతుంటే పోలీసులు మైకులు పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి 144సెక్షన్లో అమల్లోకి తెచ్చి ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా చేస్తే ఎలా? మేము జిల్లాలో చిన్నగా ధర్నా చేసి వదిలేద్దామని అనుకున్నాం. ఇక మానుకోట అంటే ఏమిటో చూపిస్తాం.
త్వరలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి రేవంత్‌ను గద్దె దింపడం ఖాయం. రేవంత్‌రెడ్డి నిత్యం సభల్లో కేసీఆర్ తల్చుకోకుండా ఉండలేకపోతున్నాడు అంటే రేవంత్‌కు కేసీఆర్ భయం ఎంతగా పట్టుకుందో అర్థమైంది. కాంగ్రెస్ ప్రాజెక్ట్ ప్రజాప్రతినిధులు మా మీద రాళ్లు వేస్తామని అంటున్నారు. మేమే సీమాంధ్ర నాయకుల మీద రాళ్లు వేసి తన్ని తరిమేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మా శక్తి సామర్థ్యాలు ఏమిటనేది మా కంటే ఎకువ మీకే తెలుసు. మానుకోట గడ్డమీద సెగ పుట్టింది. నువ్వు అధికారం కోల్పోయే రోజు దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకో రేవంత్‌రెడ్డి.
– ఎమ్మెల్సీ తకళ్ల్లపల్లి రవీందర్రావు