వరంగల్, జూన్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంత్రి కొండా సురేఖపై ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నది. కొండా సురేఖ, మురళీధర్‌రావు వివాదాస్పద వ్యవహార శైలి, అనుచిత వ్యాఖ్యలతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి నష్టం జరుగుతున్నదని ఎమెల్సీ బస్వరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి సోమవారం పీసీ సీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. కొండా సురేఖకు వ్యతిరేకంగా ఆదివారం ఇచ్చిన లేఖ కాపీని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌కు, పీసీసీ చీఫ్‌కు అందజేశారు.
సురేఖపై ఇప్పటికే చాలాసార్లు వివరించామని, ఈసారి ఊరుకునే ప్రసక్తే లేదని.. వారి తీరుతో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తాము ఇబ్బంది పడుతున్నామని పార్టీ ప్రయోజనాల కోసం ఊరుకుంటున్నామని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతుల కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలాగే పరకాల నియోజకవర్గంలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని, ఇదిలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని ఎమ్మెల్యే రేవూరి వివరించారు.
అంతేగాక సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేసేలా కొండా దంపతులు వ్యవహరిస్తున్నారని అన్నారు. సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా ఉన్నదని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పీసీసీ చీఫ్‌కు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలపై అతిగా పెత్తనం చెలాయిస్తున్నారని, ఓ మాజీ రౌడీషీటర్‌ను ముందు పెట్టి అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వివరించారు. తూర్పు నియోజకవర్గంలోని అన్ని పోలీసుస్టేషన్లలోనూ మాజీ రౌడీషీటర్ చెప్పిందే చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఈ వ్యవహారాలు ఉంటున్నాయని చెప్పారు.
కొండా దంపతుల వ్యవహారశైలిపై వరుస ఫి ర్యాదుల అంశాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తీవ్రంగా పరిగణించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈమేరకు ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని పీసీసీ క్రమశిక్షణ క మిటీ చైర్మన్ మల్లు రవి ఆదేశించారు. ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పార్టీ వ్యవహారాలను, కొండా సురేఖపై ఆరోపణలపై విచారణ చేసేలా కమిటీకి బాధ్యత అప్పగించనున్నారు. పలువురు ముఖ్యనేతలో ఓ కమిటీ నియమిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీ ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల అభిప్రాయాలను తీసుకుని పీసీసీకి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్‌కు నివేదిక ఇస్తుందని చెబుతున్నారు.