పోచమ్మమైదాన్/కాశీబుగ్గ, మే 9: ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ను, తెలంగాణ అభివృద్ధిపై చిన్నచూపు చూసిన బీజేపీని చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బీఆర్ఎస్లో అన్ని పదవులు అనుభవించి పార్టీకి నమ్మకద్రోహం చేసిన మోసగాళ్లని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. గురువారం రాత్రి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో పోచమ్మమైదాన్ సెంటర్,
కాశీబుగ్గ, వెంకట్రామ జంక్షన్లో కార్నర్ మీటింగ్ నిర్వహించగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ బీఆర్ఎస్లో అన్ని పదవులు అనుభవించి మోసం చేసిన కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలంటే ఆయన కుమార్తె కావ్యను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాజకీయ వారసత్వం కోసం కన్నతల్లి వంటి బీఆర్ఎస్కు ద్రోహం చేసిన ఆయనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లలో రాష్ర్ర్టాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఐదు నెలల్లోనే భ్రష్టు పట్టించిందని పోచంపల్లి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 60 మోసాలతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు పేదలకు ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, తులం బంగారం, రైతుబంధు, రైతు బీమా, చేనేత బీమా, గర్భిణులకు కిట్, మహిళలకు రూ.2,500 అడ్రస్ లేకుండా పోయాయని విమర్శించారు.
కేసీఆర్ అమలు చేసిన పథకాలు, ఎన్నికల ముందు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు కార్యరూపం దాల్చాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి పేదింటి బిడ్డ సుధీర్‌కుమార్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎండీ మసూద్, తుమికి రమేశ్‌బాబు, మెట్టు శ్రీనివాస్, బస్వరాజు శ్రీమాన్, డాక్టర్ హరిరమాదేవి, ఎండీ మస్తాన్, జన్ను శ్యామ్, బండారి సదానందం, గుమ్మడి శ్యామ్, మెలుగూరి నెల్సన్, దుర్గారావు, జన్ను అనిల్, జన్ను కరుణాకర్, జన్ను రవి, కుందారపు రాజేందర్, డాక్టర్ పులి సురేశ్, ఎండీ.మసూద్, ఎలేటి సతీశ్, కేతిరి రాజశేఖర్, పోలెపాక సీతయ్య, మడిపల్లి సామ్యేల్, యాసిన్, పోలెపాక ప్రశాంత్, కొడారి రవి, మడిపెల్లి నాగరాజు, కొప్పుల వీరేశం పాల్గొన్నారు.