స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 15 : జే.చొ క్కారావు(దేవాదుల) ఎత్తిపోతల పథకంలో మూడు దశలు పూర్తయితే అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహ రి అన్నారు. బుధవారం మండలంలోని తాటికొండ శివా రు మల్లన్నగండి నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు సాగునీరందించేందుకు రూ.29 కోట్లతో చేపట్టిన 14 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, 21 కిలోమీటర్ల పిల్ల కాల్వ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. కుడి కాల్వ నిర్మాణం పూర్తయితే 5,600 ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు.
జూన్ వరకు 9 కిలోమీటర్లు, మరో రెండు నెలల్లో రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సంవత్సరంలోగా 75 శాతం పనులను పూర్తి చేసి రానున్న రెండేళ్లలో లక్ష్యాన్ని అధిగమిస్తామని కాంట్రాక్టర్ తెలిపినట్లు కడి యం శ్రీహరి వివరించారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని త్వరగా పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
ఫత్తేఫూర్, క్రిష్ణాజిగూడం,తాటికొండ, గార్లగడ్డ తండా, కొత్తపల్లి గ్రామాలకు సాగునీరు అందిచాలనే లక్ష్యంతో 1999లో కోటి 60 లక్షలతో మల్లన్నగండి రిజర్వాయర్‌ను ఏర్పాటు చేశానని కడియం శ్రీహరి తెలిపారు. దీనిని హుజూరాబాద్, శనిగరం గ్రామాలకు లింకు చేశారని పేర్కొన్నారు. కరువుతో అల్లాడుతున్న స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి, జనగామ నియోజకవర్గాలతోపాటు కొడకండ్ల, దేవరుప్పుల ప్రాం తాలకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. అందులో ఆయా నియోజకవర్గాల్లో రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని, దీంతో ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయని శ్రీహరి తెలిపారు. పదేళ్ల క్రితం ఈ ప్రాంతాల ప్రజలు సాగు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బుందులు పడేవారని, ఉపాధి కోసం వలస వెళ్లేవారన్నారు. గోదావరి జలాలతో బీడు భూ ములు సస్యశ్యామలం అయ్యాయని పేర్కొన్నారు.
దేవాదుల ఫేజ్-3, ప్యాకేజీ-8లో భాగంగా రూ.6.50 కోట్లతో ఎడమ కాల్వకు టెండర్లు, అగ్రిమెంట్లు పూర్తయ్యాయని కడియం శ్రీహరి తెలిపారు. పనులు పూర్తయితే ఫత్తేపూర్, క్రిష్ణాజిగూడం, పల్లగుట్ట, చిల్పూర్, మల్కాపూర్ గ్రామాల్లో నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంట్రాక్టర్ పనులను మధ్యలో నిలిపివేశారని, ఈ సమస్యను పరిష్కరించి పనులు పూర్తి చేసి సాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రూ.29 కోట్లతో చేపట్టిన కుడికాల్వ ద్వారా జిట్టగూడెం, తాటికొండ, రాఘవాపూర్, కుర్చపల్లి, ఛాగల్లు, మీదికొండ, గోవర్ధనగిరి గ్రామాల్లో 30 కుంటలు, చెరువులు నింపడం ద్వారా 5,600 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, దీంతో రూ.29 కోట్లు మంజూరు చేశారని ఆయన తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు దేవాదుల ప్రాజెక్టు నుంచి 100 టీఎంసీలను సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు అంకితం చేశారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రూ.7.70 కోట్లతో జఫర్‌గఢ్ చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చేందుకు సీఎంకు ప్రతి ప్రాదనలు పంపామని, త్వరలోనే మంజూరు వస్తుందన్నారు. ఎగువ ప్రాంతాలైన శ్రీపతిపల్లి, లింగంపల్లి, కొండాపూర్, పీచర, వేలేరు, మద్దెలగూడెం గ్రామాలకు సాగునీరు అందించేందుకుగాను మల్లన్నగండి రిజర్వాయర్‌పై లిఫ్ట్ ఏర్పాటు చేసి అబ్దుల్‌నాగారం చెరువు నింపుతామన్నారు. అక్కడి నుంచి పైపుల ద్వారా పై గ్రామాల చెరువులు నింపి సాగునీటి సమస్య పరిష్కరించవచ్చన్నారు. 2020లో ధర్మసాగర్ మండలం వంగాలపల్లి, మల్లక్‌పల్లి, ధర్మపురం గ్రామాలకు నష్కల్ వాగు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆయా గ్రామాలకు సాగునీరు అందించవచ్చని ప్రతిప్రాదనలు పంపామన్నారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య సైతం ఇది బాగుందని చెప్పారని కడియం తెలిపారు. దీనికి సీఎం కేసీఆర్ రూ.105 కోట్లు కేటాయించారన్నారు. స్టేషన్ ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట వరకు సౌత్ కెనాల్ ఉందని, దీనికి లైనింగ్ లేకపోవడంతో నిత్యం కూరుకుపోతూ ప్రతిసారి మట్టి తీయాల్సి వస్తున్నదన్నారు. కెనాల్ లైనింగ్‌కు నిధుల మంజూరు చేయాలని సీఎంను కోరామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు పంపడంతో పెద్ద మనుసుతో స్పందించి నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన తెలిపారు.
రైతును రాజు చేయాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని, అందుకే ప్ర జలంతా అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్‌రెడ్డి, రాపోలు మధుసూదన్‌రెడ్డి, జనగామ యాదగిరి, రాజేశ్ నాయక్, ఎంపీపీ సరిత, సర్పంచ్ల ఫోరం స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్ మండలాల అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, సర్పంచ్‌లు నగరబోయిన మణెమ్మాయాదగిరి, కోతి రేణుకారాము లు, అయోధ్య, ఉద్దెమారి రాజుకుమార్, రూప్లానాయక్, రజిత, నాయకులు నాగరబోయిన యాదగిరి, పే రాల సుధాకర్, ఐలోని సుధాకర్, బూర నరేందర్, జక్కు ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.