హనుమకొండ, డిసెంబర్ 8 : హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ‘విజయ్ దివస్’ నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరుకానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ ఏర్పాటులో మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దీక్షా దివస్ పేరుతో నవంబర్ 29 నుంచి కార్యక్రమాలు నిర్వహించారు.
కేసీఆర్ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్ 9ని విజయం సాధించిన రోజుగా ‘విజయ్ దివస్’ పేరుతో పండుగలా జరుపుకోవాలని కేటీఆర్ సూచనల మేరకు మంగళవారం హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9 చరిత్రలో నిలిచిపోయే రోజును మరోసారి స్మరించుకుంటూ, ఆనాడు కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును సంబురంగా నిర్వహించుకోనున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతం బైక్ ర్యాలీగా వస్తారు. ఆ తర్వాత ఏకశిల పార్కులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు వరకు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేస్తారు. ఆ తర్వాత సమావేశం నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజన కార్యక్రమం ఉంటుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.