హనుమకొండ చౌరస్తా, జనవరి 31 : 77 ఏండ్లుగా బీసీలను అణగదొక్కారని, ఇక వారి ఆటలు సాగవనే పరిస్థితికి బీసీలు చేరుకున్నారని, ఓట్లు మావే.. సీట్లూ మావేనని కుడా మాజీ కుడా చైర్మన్, బీసీ వరంగల్ జేఏసీ చైర్మన్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో విలేకరులతో మాట్లాడా రు. ఈ నెల 2న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించనున్న బీసీ రాజకీయ యుద్ధబేరి సభ బీసీ సర్కార్ కోసమేనన్నారు. ఇది ఆరంభ సభ మాత్రమేనని, 15 లక్షల మందితో హైదరాబాద్ జింఖాన గ్రౌండ్లో విజయభేరి మోగిస్తామన్నారు.
హనుమకొండలో రేపు నిర్వహించే రాజకీయ యుద్ధబేరి సభ.. విజయ భేరి సభగా మారబోతున్నదన్నారు. గత ఎన్నిక ల్లో ఇచ్చిన హామీ మేరకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌తోపాటు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో మొదలు పెట్టి, ఎమ్మె ల్యే, ఎంపీ సీట్లలో సైతం 50శాతం సీట్లు కేటాయించాలని, లేకపోతే మీ పార్టీలకు పుట్టగతులుండవని హెచ్చరించారు. 6.2 శాతం ఉన్న మీకు 10 శాతం రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దు చేయాలని, లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. బీసీలను బానిసలు గా.., సేవకులుగానే చూశారే తప్పా లీడర్లుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీల్లో వేర్వేరు కులాలున్నప్పటికీ ప్రస్తుతం బీసీలంతా ఒకే కులంగా, అది బీసీ కులంగా ఒకతాటిపైకి వచ్చామని, ఈ సభ ఒక్క తెలంగాణకే కాదు యావత్ భారతదేశంలో కూడా ఓ విప్లవం తీసుకురాబోతున్నదన్నారు. సభకు పోలీసు అధికారులు సహాయసహకారాలు అందించాలని కోరారు. బీసీ రాజకీయ యుద్ధభేరి సభకు ముఖ్యఅథితులుగా డీఎంకే పార్టీ ఎంపీ విల్సన్, ఆర్జేడీ పార్టీ ఎంపీ మిస్సాయాదవ్, ఎస్పీ పార్టీ ఎంపీ ధర్మేంద్రయాదవ్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, మధుసూనాచారి, బస్వరాజు సారయ్య, తీన్మార్ మల్లన్న, సినీ యాక ర్ సుమన్‌గౌడ్ పాల్గొంటారని తెలిపారు.
ఖమ్మం-నల్గొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆశీర్వదించాలని సుందర్రాజ్ యాదవ్ కోరారు. 32 ఏళ్లుగా విద్యా వ్యవస్థలో ఉన్న తనకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసని, మండలిలో వారి సమస్యలపై గళమెత్తుతాని తెలిపారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్, కుల సంఘాల నాయకులు బోనగాని యదగిరిగౌడ్, గిరబోయిన రాజయ్య, వేణుగౌడ్, పులి రజినీకాంత్ ముదిరాజు, బుట్టి శ్యాంయాదవ్, మల్లేశం, నరేశ్‌గౌడ్, నరేందర్, శ్రీనివాస్, అరుణ, ఓదేలు, సోమయ్య, కనకరాజు, సురేందర్, శివశంకర్, రాజగోపాల్, రాజమహ్మద్, వేణుగోపాల్, కుమారస్వామి పాల్గొన్నారు.