హనుమకొండ, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను కొంద రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పైసల వ్యవహారంగా మార్చుతున్నారు. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న కారణంగా ఎలాగైనా ఆయా స్థానాలను గెలిచేందుకు ఎమ్మెల్యేలు ఎక్కువ డబ్బులున్న వారిని పోటీలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ ఆశావహుల మధ్య పోటీని పలువురు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్నవని, టికెట్ ఆశించే వారు ఎంత భరిస్తారో ముందే చెప్పాలని ఆదేశాలు జారీచేశారు. ఎక్కువ ఖర్చు పెట్టుకునే వారికే అవకాశం ఉంటుందని, అంచనా ఖర్చుల ప్రకా రం ముందుగానే డిపాజిట్ చేయాలని చెబుతున్నారు.
కాంగ్రెస్ కోసం పని చేసిన వారికి అవకాశం ఇవ్వకుండా, డబ్బుల ప్రాతిపదికన అవకాశాలుంటాయనేలా ఎమ్మెల్యేల తీరు ఉంటున్నదని అధికార పార్టీలో మొదటి నుంచి ఉంటున్న నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా డబ్బులున్న వారికే టికెట్లిచ్చే విధానం సరికాదని అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌లోని పాత వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని, లేదంటే పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు నాయకులు ఎమ్మెల్యేలకు స్పష్టం చేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షుడయ్యే అవకాశం ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు అధికార పార్టీలోని పలువురు నేతలు ఆసక్తి చూపుతుండడంతో దీనిని ఎమ్మెల్యేలు అవకాశంగా తీసుకుంటున్నారు. డబ్బుల ప్రాతిపదికన టికెట్ల కేటాయింపు ఉంటుందని చెబుతుండడంతో పాత కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నది. యూ రియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో కొనుగోలు చేసిన సన్న వడ్లకు ప్రభుత్వం ఇప్పటికీ బోనస్ చెల్లించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదనంగా ఒక్కరికీ ఆసరా పెన్షను మంజూరు చేయలేదు. పింఛన్లు పెంచి ఇస్తామన్న హామీని అమలుచేయలేదు. మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇవ్వడం లేదు. యువత నుంచి రాజీవ్ యు వ వికాసం దరఖాస్తులు స్వీకరించి పక్కన పడేసింది.
పేద కుటుంబాలకు రూ. 500కు గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు (గృహజ్యోతి) పథకాలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన విద్య, వసతి కరువైంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు అసలే లేవు. రోడ్లు దయనీయంగా మారాయి. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్వహణను కాంగ్రెస్ పక్కకు పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత నెలకొన్నది. దీంతో స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు డబ్బుల ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను అమలు చేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేల షరతులతో కాంగ్రెస్‌లోని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం హైకోర్టులో ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై అస్పష్టత నెలకొన్నది. రిజర్వేషన్లు మారుతాయా? ఇప్పుడున్నవి కొనసాగుతాయా? అనే చర్చ జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేల మాట విని డబ్బులు డిపాజిట్ చేసిన తర్వాత ఎన్నికలు వాయిదా పడినా, రిజర్వేషన్లు మారినా తమ పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఎమ్మెల్యేల వద్దకు వెళ్లాలని, అప్పటిదాకా వేచి చూడాలనే ధోరణిలో ఆశావహులు ఉంటున్నారు.