దామెర, ఫిబ్రవరి 29: ప్రజాప్రతినిధులను పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టడంపై దామెర మండల సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కాగితాల శంకర్ అధ్యక్షతన జరుగగా, జడ్పీటీసీతోపాటు ఎంపీటీసీలు నిరసనగా నల్ల కండువాలు ధరించి హాజరయ్యారు. ఈ సందర్భంగా దుర్గంపేట, దామెర ఎంపీటీసీలు గండు రామకృష్ణ, పోలం కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు వెళ్లిన వైస్ ఎంపీపీ జాకీర్అలీతోపాటు మరికొందరు ప్రజాప్రతినిధులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. థర్డ్ డిగ్రీ ఉపయోంచి విచక్షణారహితంగా కొడుతూ చిత్రహింసలు పెట్టారన్నారు. జాతరలో జై తెలంగాణ. జై చల్లా అంటూ నినాదం చేయడం తప్పా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేశారని వైస్ ఎంపీపీ జాకీర్‌అలీ ఆవేదన వ్యక్తం చేశారు.
జడ్పీటీసీ గరిగె కల్పన మాట్లాడుతూ పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధులపై పోలీసుల చర్యలను మండల సర్వసభ్య సమావేశం తీవ్రంగా ఖండిస్తున్నదని ఎంపీపీ కాగితాల శంకర్ అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించిన పోలీసుల తీరుపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమాధానం చెప్పాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అనంతరం సమావేశాన్ని వారు బహిష్కరించారు. సమావేశంలో తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, ఎంపీడీవో గుమ్మడి కల్పన, ఎంపీవో రంగాచారి, ఏఈలు గుర్రం రమేశ్, సతీశ్, ఎంఈవో రమాదేవి, ఏపీఎం ఝాన్సీ, వెటర్నరీ డాక్టర్ దీపిక, ఏఈవో అశోక్‌బాబు, ఏపీవో శారద, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు విష్ణుమూర్తి, సతీశ్, మోహన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.