జనగామ, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : జనగామకు జుడా(జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుచేయాలన్న స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రయత్నం ఫలించింది. మున్సిపల్ వార్డులు సహా చుట్టుపక్కల 3నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా)లో విలీనం చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించకుండా అన్ని పక్షాలతో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని లేఖ రూపంలో తెలియజేయడంతో జుడా ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రస్తుతం ఉన్న 30 మున్సిపల్ వార్డులు సహా పట్టణానికి నలువైపులా ఉన్న శామీర్‌పేట, పెంబర్తి, యశ్వంతాపూర్, ఎల్లంల గ్రామాలను కుడాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను అంగీకరించకుండా అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
దీనిపై కొద్దిరోజుల క్రితం జనగామలోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, వివిధ వర్గాల మేధావులు, విద్యావేత్తలు, డాక్టర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కుల సంఘాలు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, ఆయా జేఏసీ, కార్మిక సంఘాలు, వివిధరంగాల నిపుణులతో ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా సమావేశమై మున్సిపల్ సహా చుట్టుపక్కల గ్రామాలను కుడాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై అభిప్రాయ సేకరణ జరిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జిల్లాకేంద్రంగా ఏర్పడిన జనగామకు స్వయం ప్రతిపత్తి ఉంటేనే ప్రణాళికాబద్ధమైన పట్టణ విస్తరణ, అభివృద్ధి సాధ్యమన్న మెజార్టీ వర్గాల అభిప్రాయాన్ని తిరిగి లేఖ రూపంలో ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
రైలుమార్గం సహా నాలుగు రాష్ర్టాలను కలిపి రెండు హైవేలు ఉన్న జనగామ పట్టణం హైదరాబాద్‌కు అతి సమీపంలో గ్రోత్ కారిడార్‌గా ఉందని సాంకేతిక ఆధారాలతో గణాంకాలతో కూడిన నివేదిక సర్కారుకు పంపడంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా తీసుకున్న చొరవ కారణంగానే ప్రత్యేకంగా ‘జుడా’కు బీజం పడింది. బీఆర్ఎస్ సర్కారు పాలనలో జిల్లాల పునర్విభజన తర్వాత పట్టణీకరణలో భాగంగా సమీప గ్రామాల విలీనం తర్వాతే స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో పంచాతీయల విలీనం, నగర పంచాయతీలకు స్థాయి పెంపు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటు అంశాలు 2017లో తెరపైకి వచ్చిన సమయంలో సాంకేతిక, కోర్టు వివాదాల కారణాలతో అప్పటి ప్రతిపాదనలు వెనక్కి వెళ్లిన అంశాన్ని కూడా ఉటంకించారు.
దీనిపై గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కన్వీనర్‌గా జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో), జిల్లా గ్రామీణ, పట్టణ ప్రణాళిక అధికారి (డీటీసీపీవో), ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు సభ్యులుగా ప్రత్యేక కమిటీ సమావేశమైందన్న అంశాన్ని గుర్తుచేశారు. జిల్లాకేంద్రంతో పాటు పట్టణీకరణ ప్రభావం, విస్తరణకు అవకాశాలున్న గ్రామాలు, 2011 జనాభా, 2024 ప్రస్తుత జనాభా అంచనా, ఏరియా వంటి వివరాలతో కూడిన ప్రతిపాదిత ప్రణాళికను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ద్వారా అప్పట్లో ప్రభుత్వానికి పంపిన నివేదికను కూడా స్థానిక ఎమ్మెల్యే తన లేఖలో ప్రసావించడంతో జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (జుడా) ఏర్పాటుకు సర్కారు సిద్ధమైంది.