జనగామ చౌరస్తా, డిసెంబర్ 23: సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ కలెక్టరేట్ వద్ద 14వ రోజు కొనసాగుతున్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శిబిరానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో నంబర్ 16ను పునరుద్ధరించి ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు.
14 రోజులుగా ఉద్యోగులు సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని, విద్యా శాఖకు మంత్రి కూడా లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో 16 ప్రకారం వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్ చేశారన్నారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల డిమాండ్స్‌ను వినడానికి కూడా ఈ ప్రభుత్వం సమయం ఇవ్వడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వా నికి దున్నపోతు మీద వానపడ్డట్లే ఉందని ఎద్దేవా చేశారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల పోరాటంలో తన వంతు కృషితో పాటు బీఆర్ఎస్ మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, మాజీ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ తాళ్ల సురేశ్ రెడ్డి, కౌన్సిలర్లు ముస్త్యాల దయాకర్, నీల యాదగిరి, పట్టణ యూత్ అధ్యక్షుడు ఉల్లెంగుల సందీప్, యాకూబ్‌పాషా, రాజ్‌కుమార్ రోడ్రిక్స్, పానుగంటి ప్రవీణ్, కన్నారపు వంశీకృష్ణ, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరి రమేశ్, ప్రధాన కార్యదర్శి బైరగోని దయాకర్ గౌడ్, కోశాధికారి గోలి రవీందర్‌రెడ్డి, గోరంట్ల యాదగిరి, రాజ్ కుమార్ పాల్గొన్నారు.