ఖిలావరంగల్, జూన్ 14: వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల తలరాత మార్చే దిశగా రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన ఉంటుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ నెల 17న తూర్పులో మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలను శివనగర్‌లోని సాయి కన్వెన్షన్ భవనంలో బుధవారం ఆయన వెల్లడించారు. 17న మంత్రి కేటీఆర్ ముందుగా సంగెం మండలంలోని మెగా టెక్స్టైల్ పార్కును సందర్శిస్తారని చెప్పారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 12 గంటలకు ఖిలావరంగల్‌లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి ఓసిటీలో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం భోజనం చేసి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో చర్చా కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం ఆజంజాహి మిల్లు మైదానంలో కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తారన్నారు. అక్కడి నుంచి నేరుగా దేశాయిపేటకు చేరుకొని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ప్రారంభిస్తారన్నారు. తర్వాత కొత్తవాడలో లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశాయిపేటలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తామని వివరించారు. అక్కడి నుంచి మండిబజార్‌కు చేరుకొని రూ. 6.50 కోట్లతో మసీదులు, ఈద్గాలు, జెండా గద్దెల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు.
వరంగల్చౌరస్తాలో స్మార్ట్రోడ్లను ప్రారంభిస్తారని, రూ. 77 కోట్లతో అత్యాధునిక వసతులతో కూడిన బస్టాండ్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారని వెల్లడించారు. తర్వాత ఖిలావరంగల్ రోడ్డులోని ఎమ్మెల్యే మీడియా సెంటర్‌ను ప్రారంభిస్తారన్నారు. రంగశాయిపేటలో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఉర్సుగుట్ట వద్ద కల్చరల్ ఆడిటోరియం తదితర పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పారు. రూ. 50 కోట్లతో తాగునీటి పనులు చేపట్టనున్నారన్నారు. ఉర్సు దర్గాను కేటీఆర్ సందర్శించి ప్రార్థనలు చేస్తారని, అనంతరం రూ. 83 లక్షలు నిధులతో దర్గా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. తర్వాత ఖిలావరంగల్ రాతికోట ఉత్తర ద్వారం వద్ద రూ. 7 కోట్లతో ఏర్పాటు చేసిన పసాడ్ లైట్లను ప్రారంభిస్తారన్నారు. హెలిప్యాడ్ నుంచి మొదలు సభా ప్రాంగణానికి వచ్చే వరకు కేటీఆర్ వెంట మూడు వేల మంది యువకులు ఉంటారన్నారు.
నియోజకవర్గంలో రూ. 425 కోట్ల నిధులతో పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతా భావంగా 50 వేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు ఆయా పనుల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, దిడ్డి కుమారస్వామి, పోశాల పద్మ, గుండేటి నరేందర్, కావటి కవిత, వేల్పుగొండ సువర్ణ, ముష్కమల్ల అరుణ, వస్కుల బాబు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.