వరంగల్ : పేదలు ఆత్మగౌరవంతో బతుకాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. జిల్లాలోని దూపకుంట వద్ద ప్రభుత్వం రూ.139 కోట్లతో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆయన జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు.
రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అలాగే ప్రతి పేదకు నిలువు నీడ ఉండాలనే సదుద్దేశంతో డబుల్ బెడ్ రూండ్లు నిర్మిస్తున్నారు. విడతల వారీగా అర్హులైన అందరికి ఇండ్లు కట్టిస్తామన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.