వరంగల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రూపుల గొడవతో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది. అటు కొండా దంపతులు, వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేల పరస్పర విమర్శలు, ఆరోపణలు, ఫిర్యాదులతో ఇప్పటికే ముదరగా తాజా కొండా మురళి గాంధీభవన్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలతో పంచాయితీ కాస్త తారస్థాయికి చేరింది. పార్టీ అధిష్టానం, పీసీసీ హెచ్చరికలు చేసినా, నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వడం అటుంచి అందుకు భిన్నంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే కొండా విమర్శలు చేయడాన్ని ప్రత్యర్థి వర్గం తీవ్రంగా స్పందించింది.
ఈమేరకు హనుమకొండలో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై కొండా మురళిపై జూలై 5వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని పీసీసీకి అల్టిమేటం జారీ చేసింది. క్రమశిక్షణ కమిటీకి తప్పుడు వివరాలివ్వడమే గాక ఎమ్మెల్యేల పట్ల దురుసుగా మాట్లాడుతున్న మురళిపై చర్యలు తీసుకోవాల్సిందేననే డిమాండ్ వ్యక్తమైంది.
క్రమశిక్షణ చర్యల ప్రక్రియలో భాగంగా పీసీసీ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిన కొండా మురళీ.. అందుకు భిన్నంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే మరిన్ని విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. మంత్రి కొండా సురేఖ దంపతులకు వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం.. మంత్రి సురేఖ.. ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డిలపై విమర్శలు చేయడం… కొండా మురళీ గాంధీభవన్‌లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ రాజకీయం నవ్వులాటగా మారిందనే భావన వ్యక్తమవుతున్నది.
వారం రోజులుగా ఒడువని పంచాయితీగా కొనసాగుతున్నది. కాంగ్రెస్ అధిష్టానం, పీసీసీ స్థాయిలో జోక్యం చేసుకుని హెచ్చరికలు చేసినా, నోటీసులు ఇచ్చినా.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పార్టీ గ్రూపు రాజకీయాలు ఆగడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై, ఇతర ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి శనివారం చేసిన విమర్శలతో ప్రత్యర్థి వర్గం తీవ్రంగా స్పందించింది. కొండా మురళి విమర్శలను తిప్పికొట్టడం, తమ ఫిర్యాదులపై పీసీసీ త్వరగా నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్‌తో మంత్రి సురేఖ వ్యతిరేక వర్గం ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధికారిక నివాసంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు.. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కొండా మురళీ చేసిన విమర్శలపై తీవ్రంగా పరిగణించాలని, ఈ విషయంలో జూలై 5లోపు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి తప్పుడు వివరాలు ఇచ్చి తప్పించుకోవాలని చూస్తున్నాడని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు నష్టం కలిగించేలా కొండా మురళీధర్‌రావు మాట్లాడుతున్నారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడాడని, తప్పుడు వివరాలతో ఎమ్మెల్యేలపై దురుసుగా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. వీటన్నింటినీ పరిశీలించి మురళిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు.. పీసీసీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు.
కొండా మురళి తప్పుడు ప్రచారం చేశారు. కొండా దంపతులు అన్ని పార్టీలు మారారు. కొండా మురళీకి నిజంగా దమ్ముంటే సొంతంగా పార్టీ పెట్టుకోవాలలి. మురళిపై చర్యల విషయంలో వచ్చే 5లోపు పీసీసీ నిర్ణయం తీసుకోవాలి. క్రమశిక్షణ సంఘం మురళిపై కచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. కులాల పేరుతో పబ్బం గడుపుకోవడం మురళికి అలవాటే.
– ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
కొండా మురళి సొంత పార్టీ కార్యకర్తలను వేధించారు. తూర్పు నియోజకవర్గంలో మురళి చక్కదిద్దుకోవాలే గానీ ఇతర నియోజకవర్గాల్లో కాదు. మురళి వల్ల తాను గెలిచాననడం హాస్యాస్పదం. పార్లమెంట్ ఎన్నికల్లో సొంత సెగ్మెంట్లో 9వేల ఓట్ల మైనస్‌లో ఉన్న కొండా మురళి నన్ను గెలిపించానని అంటంటే జనం నవ్వుతున్నారు.
– వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు
కొండా మురళి వల్ల కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అదుపు తప్పింది. కడివెడు పాలల్లో విషం చుక్కగా కొండా మురళీ మారాడు. ప్రాణభిక్ష పెట్టిన వారిపైనే మురళి విమర్శలు చేస్తున్నాడు.
– ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షురాలు