ఐనవోలు, జూన్ 3 : ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరసనలు, నిలదీతల పర్వం కొనసాగుతోంది. కొన్నిచోట్ల పేద ప్రజలే గాక సొంత పార్టీ నాయకుల నుంచే కాం గ్రెస్ ఎమ్మెల్యేలకు చేదు అనుభవం ఎదురవుతోంది. అర్హుల జాబితా నుంచి పేరు తొలగించారని నిన్న స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓ మహిళ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాళ్లు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకోగా, తాజాగా మంగళవారం ఐనవోలులో అర్హులకు కాకుండా పక్కా ఇళ్లు, ఆస్తులున్న వారికి ఇళ్లు ఎలా మంజూరు చేస్తారంటూ వర్ధన్నపేట ఎమ్మెల్యేను సొంత పార్టీ కార్యకర్తలే నిలదీశారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నామని.. అయినా తమను పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే తీరుపై అసహనం వ్యక్తంచేసిన నాయకులు.. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.
ఐనవోలు మండలకేంద్రంలో మంగళవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి ఎమ్మె ల్యే నాగరాజు హాజరయ్యారు. మండలవ్యాప్తంగా 470 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా, 336 మందికి మంజూరు పత్రాలు అందజేశారు. ఐనవోలులో 60 మంది లబ్ధిదారుల్లో 37 మందికి మంజూరు పత్రాలను అందజేశారు. కాగా ఐనవోలుకు చెందిన సుమారు 20 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమావేశం ముగించుకొని వెళ్తున్న ఎమ్మెల్యేను నిలదీశారు.
అర్హులకు కాకుండా పక్కా ఇండ్లు, భూములు, ఆస్తులున్న వారి పేర్లు ఇండ్ల జాబితాలో ఎలా వచ్చాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిజమైన లబ్ధిదారుల ఎంపి క కోసం రీ సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు. అంతకుముందు ఐనవోలు గ్రామస్తులు కలెక్టర్ ప్రావీణ్యను కలిసి అర్హులకు ఇండ్లు ఇవ్వాలని విన్నవించగా, అర్హత ఉండి పేదలకు లబ్ధి చేకూరకపోతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
‘గ్రామంలో ఉండేందుకు మాకు ఇల్లు లేదు. బతుకుదెరువు కోసం కుటుంబసభ్యులందరం కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నం. మాకు సంబంధించిన అన్ని ఆధారాలు కక్కిరాలపల్లి ఊరు పేరు మీదే ఉన్నాయి. అయితే ఇక్కడ నివాసం ఉండడం లేదని, ఎవరో కావాలనే ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో నుంచి పేరు తీసేశారు’ అంటూ కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన తూళ్ల రజిత కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
– తూళ్ల రజిత, కక్కిరాలపల్లి, ఐనవోలు